నవశకం : ఇంటింటికి నాణ్యమైన బియ్యం

  • Published By: madhu ,Published On : June 8, 2020 / 01:20 AM IST
నవశకం : ఇంటింటికి నాణ్యమైన బియ్యం

ఏపీలో సోమవారం నుంచి నుంచి నేరుగా ఇంటింటికి నాణ్యమైన బియ్యాన్ని అందించబోతోంది పౌరసరఫరాల శాఖ. దీనిలో భాగంగా అమరావతిలో మొబైల్‌ యూనిట్ల ద్వారా ఇంటింటికి వెళ్లి బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ట్రయల్‌ రన్‌ చేయబోతోంది. మొబైల్‌ వాహనంలోనే ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మిషన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు, లబ్ధిదారుల ముందే బియ్యం బస్తా సీల్‌ ఓపెన్‌ చేసి రేషన్‌ అందిస్తారు. ప్రయోగాత్మకంగా చేపట్టే ఈ విధానంలో లొసుగులను సవరించి సెప్టెంబర్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు.

ప్రత్యేకంగా తయారు చేయించిన బ్యాగులను లబ్దిదారులకు ముందుగానే ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్ ఆఫిషియో కార్యదర్శి శశిధర్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల 370 మొబైల్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టెండర్లను పిలుస్తామన్నారు. 
గత ప్రభుత్వంలో రేషన్‌ కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీ కోసం ప్రజలు జన్మభూమి కార్యక్రమాల్లో  దరఖాస్తులు చేసుకునే వారు. కానీ ఇప్పుడు ఏకంగా ప్రజల దగ్గరికే అధికారులు వెళ్లనున్నారు. 

రేషన్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. రేషన్ కార్డు దగ్గరి నుంచి సరుకులు తీసుకొనే వరకు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. ముందుగా రేషన్ కార్డుల జారీని మరింత సులభతరం చేసేలా పక్కా ప్రణాళికలు రచించింది. దరఖాస్తు చేసుకుంటే..అర్హత ఉన్న వారికి కేవలం ఐదు రోజుల్లో రేషన్ కార్డు అందచేయాలని సీఎం జగన్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంది. డోర్ డెలివరీలో భాగంగా రేషన్ కార్డు దారులకు ఉచితంగా బియ్యం సంచుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రతి కుటుంబానికి 10, 15 కిలోల సంచులు ఇస్తామన్నారు. ఇప్పటికే ఈ సంచులను సీఎం జగన్ పరిశీలించారు కూడా.

Read: జగన్ వెన్నుపోటు పొడవడు… పొడిపించుకోడు: పోసాని