జైల్లో మళ్లీ అరుపులు, కేకలు.. భయంతో హడలిపోతున్న పద్మజ తోటి ఖైదీలు

జైల్లో మళ్లీ అరుపులు, కేకలు.. భయంతో హడలిపోతున్న పద్మజ తోటి ఖైదీలు

Padmaja behaves strangely in Madanapalle sub-jail: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మదనపల్లె కూతుళ్ల హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి మదనపల్లె సబ్ జైల్లో ఉన్న నిందితురాలు పద్మజ.. చాలా వింతగా ప్రవర్తిస్తోంది. తన ప్రవర్తనతో తోటి ఖైదీలను బెంబేలెత్తిస్తోంది. తాజాగా మరోసారి ఆమె తన తోటి ఖైదీలను హడలుగొట్టింది. ‘నేనే శివుడిని. నన్నే లోపల వేస్తారా?’ అంటూ వీరంగమేసింది. శివా, శివా అంటూ పెద్దగా కేకలు వేయడంతో మహిళా బ్యారక్‌లోని తోటి ఖైదీలు భయంతో హడలిపోయారు. రాత్రంతా ఆమె కేకలు వేయడంతో ఖైదీలు జాగారం చేయాల్సి వచ్చింది.

కన్న కూతుళ్లు(అలేఖ్య, సాయి దివ్య) హత్య కేసులో పద్మజ, పురుషోత్తమ నాయుడు ఇద్దరూ సబ్ జైలులోనే ఉన్నారు. వారి మానసిక పరిస్థితి బాగోలేదని ఇప్పటికే డాక్టర్లు నిర్ధారించారు. దీంతో వీరిని విశాఖపట్టణం మానసిక వైద్యశాలకు తరలించాలని నిర్ణయించారు. అక్కడికి తరలించేందుకు తమకు ఎస్కార్ట్ కావాలంటూ జైలు అధికారులు పోలీసులకు లేఖ రాశారు.

అయితే, వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పద్మజ, పురుషోత్తమ నాయుడుల తరలింపు ఆలస్యమవుతోంది. మరోవైపు, జైలులో ఉన్న పురుషోత్తమ నాయుడు.. కుమార్తెలను తలచుకుని కన్నీరుమున్నీరు అవుతున్నట్టు జైలు అధికారులు తెలిపారు.

పద్మజ తరచూ ‘శివ.. శివ’ అంటూ అరుస్తున్నట్లు మదనపల్లె సబ్‌జైలు సూపరింటెండెంట్‌ రామకృష్ణయాదవ్‌ చెప్పారు. మెరుగైన చికిత్స కోసం దంపతులను విశాఖకు తరలించాలని తిరుపతి వైద్యులు సూచించినప్పటికీ.. బందోబస్తుకు ఏఆర్‌ సిబ్బంది సహకరించడం లేదని ఆయన వాపోయారు. ఈ విషయమై జైళ్లశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని, మూడు రోజులుగా చిత్తూరు ఏఆర్‌ సిబ్బందికి రేడియో సమాచారం ఇస్తున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మజ ఉంటున్న బ్యారక్‌లో మహిళలు రాత్రుల్లో నిద్రించాలంటే భయపడుతున్నారని చెప్పారు. పురుషోత్తమ నాయుడు కూడా ఒంటరిగా కూర్చుని నమస్కారాలు చేసుకుంటున్నాడని.. ఒక్కోసారి ఏడుస్తున్నాడని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి వారిని విశాఖకు తరలించేందుకు బందోబస్తు ఏర్పాటు చేయాలని రామకృష్ణ కోరారు.

కాగా, అక్కాచెల్లెళ్లలో ఒకరైన అలేఖ్య ఇన్‌స్టాగ్రాం అకౌంట్ సోమవారం(ఫిబ్రవరి 1,2021) ప్రైవేటుగా మారడం చర్చకు దారితీసింది. జనవరి 29న అలేఖ్య ఫేస్ బుక్ అకౌంట్ బ్లాక్‌ కాగా.. తర్వాత ఖాతానే తొలగించినట్లుగా చూపించింది. ఇప్పటికే చిన్నకుమార్తె సాయిదివ్య సోషల్ మీడియా అకౌంట్ల గురించి చర్చ జరుగుతోంది. ఆమె ఇన్‌స్టాగ్రాం అకౌంట్ ఉన్నా.. అందులో పోస్టులేమీ లేనట్టు కనిపిస్తోంది. తాజాగా అలేఖ్య అకౌంట్ ప్రైవేటుగా మారడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం నాటికి అలేఖ్య ఇన్‌స్టాగ్రాంలో 318 మంది ఫాలో అవుతుండగా, సోమవారం ఈ సంఖ్య 317కి తగ్గింది. సోషల్ మీడియా కంపెనీలే ఈ అకౌంట్లను ప్రైవేట్ గా మార్చాయా.. లేక ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా అనే విషయం తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.