కరోనా మెడిసిన్ విడుదల చేసిన డా.రెడ్డీస్…హోం డెలివరీ కూడా

  • Published By: venkaiahnaidu ,Published On : August 19, 2020 / 06:23 PM IST
కరోనా మెడిసిన్ విడుదల చేసిన డా.రెడ్డీస్…హోం డెలివరీ కూడా

దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్‌ కరోనా వైరస్ డ్రగ్ లాంచ్ చేసింది. భారతదేశంలో అవిగాన్ (ఫావిపిరవిర్) 200 ఎంజీ టాబ్లెట్లను విడుదల చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. కాగా తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న కోవిడ్-19 రోగుల చికిత్సకు అవిగాన్ (ఫావిపిరవిర్) ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే



ఈ సందర్భంగా రెడ్డీస్ లాబొరేటరీస్ మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది కరోనా బాధితులకు వేగంగా ఈ ఔషధాన్ని అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 42 నగరాల్లో ఉచిత హోమ్ డెలివరీ చేస్తున్నట్టు తెలిపింది. జపనీస్‌ దిగ్గజం ఫుజిఫిల్మ్‌ టొయామా కెమికల్‌ కంపెనీతో గ్లోబల్‌ లైసెన్స్‌ ఒప్పందంలో భాగంగా వీటిని తీసుకొచ్చినట్టు డాక్టర్ రెడ్డీస్ బ్రాండెడ్‌ మార్కెట్స్‌ సీఈవో ఎంవీ రమణ తెలిపారు.



అవిగాన్ రెండు సంవత్సరాల షెల్ఫ్ లైఫ్ తో 122 టాబ్లెట్ల పూర్తి థెరపీ ప్యాక్‌లో వస్తుందన్నారు. అలాగే సోమవారం-శనివారం వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేసేలా ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ప్రస్తుతానికి వారు జపాన్ నుండి దీనిని దిగుమతి చేసుకుంటున్నారని, త్వరలో దేశీయంగా తయారు చేస్తామని రమణ తెలిపారు. అలాగే కరోనాకు సంబంధించి మరో ఔషధమైన రెమ్‌డెసివిర్‌ను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లు ఆయన తెలిపారు.