Drink sanitizer : మత్తు కోసం కూల్ డ్రింక్‌లో శానిటైజర్‌ కలిపి తాగేస్తున్నారు..

విజయవాడలో శానిటైజర్‌ కలకలం రేగుతోంది. చేతులు శుభ్రపరుచుకునేందుకు తయారు చేసిన శానిటైజర్‌ని మత్తు కోసం గడగడా తాగేస్తున్నారు.

Drink sanitizer : మత్తు కోసం కూల్ డ్రింక్‌లో శానిటైజర్‌ కలిపి తాగేస్తున్నారు..

Drink Sanitizer

Drinking with a sanitizer in a cool drink : విజయవాడలో శానిటైజర్‌ కలకలం రేగుతోంది. శానిటైజర్‌ పేరు వింటనే అక్కడి బస్తీల్లో ప్రజలు హడలెత్తిపోతున్నారు. కరోనా నుంచి రక్షణ కల్పించాల్సిన శానిటైజర్లు.. మందుబాబుల పాలిట యమపాశాలవుతున్నాయి. బ్రాండ్‌ ఏదైనా కానివ్వండి సాధారణంగా మద్యం బంగారు రంగులో ధగధగా మెరిసిపోతూ ఉంటుంది. బీరైతే బుడగలు చిమ్ముతూ పైకి ఎగిసిపడుతుంది. కల్లయితే తెల్లరంగులో ఉంటుంది. ఓడ్కా అయితే నీళ్లలా కనిపిస్తుంది. కానీ విజయవాడలో ఇవేమీ కాకుండా బ్లూ కలర్‌లో దొరికే మత్తు పానీయం తాగేస్తున్నారు మందుబాబులు. కొంపదీసి వీళ్లు కిరోసిన్‌ తాగేస్తున్నారనుకుంటే పొరపాటే. వీళ్లు తాగేది శానిటైజర్‌. చేతులు శుభ్రపరుచుకునేందుకు తయారు చేసిన శానిటైజర్‌ని మత్తు కోసం గడగడా తాగేస్తున్నారు.

ఏపీలో దశల వారీగా మద్యనిషేధం అమలు చేస్తున్నారు. దీంతో ఆల్కహాల్‌ రేట్లు విపరీతంగా పెంచేశారు. చీప్‌ లిక్కర్‌ క్వార్టర్ బాటిల్‌ కొనాలన్నా వందల రూపాయలు పెట్టక తప్పని పరిస్థితి. దీంతో మత్తుకు అలవాటు పడిన మందుబాబుల తట్టుకోలేకపోతున్నారు. నిషా కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. తక్కువ ధరకు దొరికే శానిటైజర్లను తాగేస్తున్నారు. మత్తులో తూగుతూ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. శానిటైజర్లు కేవలం 50 రూపాయలకే దొరకుతుండటంతో కూలీలు, రిక్షాపుల్లర్లు వాటికి అలవాటు పడిపోయారు. శానిటైజర్లను కొని వాటిని కూల్‌డ్రింక్‌ల్లో కలుపుకుని తాగుతున్నారు. వైన్స్‌ షాప్‌లో మందు కొనేందుకు డబ్బులు సరిపోకపోవడంతో చందాలు పోగేసుకుని మరీ శానిటైజర్‌ కొంటున్నారు. మరికొందరు ఉదయమే టిఫిన్‌ చేస్తామంటూ పదొ పరకో పట్టుకుని బయటకు వస్తున్నారు ఆల్కహాల్‌ తాగేస్తున్నారు

వారం రోజుల్లోనే ఒక్క విజయవాడ నగర పరిధిలో ఆరుగుగు వ్యక్తులు శానిటైజర్లు తాగి చనిపోయారు. కుటుంబాలకు విషాధం మిగిల్చారు. విజయవాడలో వించిపేట, గొల్లపాలెంగట్టు, ఖాదర్‌సెంటర్‌, వన్‌టౌన సెంటర్‌లలో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. శానిటైజర్‌ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని కుటుంబ సభ్యులు హెచ్చరిస్తున్నా… స్నేహితులు చెబుతున్నా.. మందు బాబులు వినిపించుకోవడం లేదు. మందు తాగక పోతే షివరింగ్‌ వస్తుందని, తల తిరిగిపోతుందని చెబుతూ శానిటైజర్లు తాగుతున్నారు.

కుటుంబ సభ్యులు ఎంతగా కట్టడి చేసినా.. ఏదో రకంగా దీన్ని తీసుకుంటున్నారు. శానిటైజర్‌ తాగిన వాళ్లలో పల్స్‌ రేట్‌ పడిపోవడం, కడుపు ఉబ్బడం వంటి కారణాలతో చనిపోతున్నారు. గతేడాది లాక్‌డౌన్‌ సందర్భంగా విజయవాడలో ఇదే తరహా పరిస్థితి తలెత్తింది . ఆల్కహాల్‌ లభించక మందు బాబులు చిర్రెత్తిపోయారు. ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిపై టెన్‌ టీవీ కథనాలు ప్రసారం చేయడంతో ప్రభుత్వ అధికారులు స్పందించారు. ప్రత్యేక అవగాహాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.