Dung Cakes Festival : పల్లె వాసుల పురాతన ఆచారం… పిడకల సమరం… ఎక్కడో తెలుసా!..

Dung Cakes Festival : పల్లె వాసుల పురాతన ఆచారం… పిడకల సమరం… ఎక్కడో తెలుసా!..

Dung Cakes Festival Of Veerabadhra Swamy Jatara

Dung cakes Festival : ఒక్కో ప్రాంతంలో ఒక్కోవిధమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఆదోని డివిజన్‌ ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో కొలువైన వీరభద్రస్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా జరిగే పెద్దనూగ్గులాటకు ఉభయ రాష్ట్రాల్లో ఎంతో పేరుంది. దీన్నే పిడకల సమరం అని కూడా అంటారు. ఈ సమరానికి సర్వం సిద్ధం చేశారు. వేడుకలను చూడటానికి కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. కైరుప్పల గ్రామంలో వీరభద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా ఉగాది మరుసటి రోజు పిడకల సమరాన్ని గ్రామస్థులు నిర్వహిస్తారు.ఇది కొన్నేళ్లుగా వస్తున్న ఆచారం. కైరప్పల చుట్టుపక్కల గ్రామాలైన పుప్పాలదొడ్డి, కారుమంచి అల్లారుదిన్నె, కుంకునూరు, చెన్నంపల్లి, వెంగళయాదొడ్డి, పుటుకలమర్రి, వలగొండ, తదితర గ్రామల్లోని గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో నెలరోజుల ముందు నుంచే ప్రత్యేకంగా పిడకలను తయారు చేస్తారు.

వీటిని ఆయా గ్రామస్థులు ప్రత్యేకంగా ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లల్లో ఊరేగింపుగా కైరుప్పలలోని సమరాంగ ప్రదేశానికి తరలిస్తారు. ఆతర్వాత కైరుప్పల గ్రామస్థులు రెండు వర్గాలుగా విడిపోయి సమరానికి తలపడ్డారు. సమరంలో భక్తులకు గాయాలైతే స్వామి విభూదిని రాసుకుంటే.. కొన్ని రోజులకే నయమవుతాయని భక్తులు చెబుతారు. సంప్రదాయానికి వెనక ఉన్న నేపథ్యంలో వీరభద్రస్వామి, కాళమ్మ(భద్రకాళీదేవి)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తారు. పెళ్లి విషయంలో కొంత ఆలస్యం చేస్తారు. ఒక రోజు సాయంత్రం వేళ హంద్రీ ఒడ్డుకు వీరభద్రస్వామి తన అనుచరులతో కలిసి విహారానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉంటారు.

ఈక్రమంలో పెళ్లిని ఆలస్యం చేయడంతో ఆగ్రహించిన కాళమ్మ వీరభద్రస్వామి అనుచర వర్గంపై తన అనుచరులతో కలిసి పిడకలతో దాడి చేస్తుంది. వీరభద్రస్వామి తన అనుచరులతో కలిసి ప్రతిదాడికి చేసి తిప్పికొడతారు. ఇది రణరంగాన్ని తలపిస్తుంది. ఆ తరువాత చుట్టు పక్కల గ్రామదేవతలైన కాత్రికయ్య, గిడ్డంజనేయస్వామిలతో పాటు గ్రామ పెద్దలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి వివాహానికి ఒప్పిస్తారు.

అప్పటి నుంచి వీరభద్రస్వామి జాతరలో పిడకల సమరాన్ని కొనసాగిస్తూ.. వస్తున్నారు. పిడకల ఉత్సవానికి పక్కనే ఉన్న కారుమంచి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి వంశుస్థులు వచ్చి వీరభద్రస్వామి ఆలయంలో పూజలు చేసిన తర్వాతే పిడకల సమరాన్ని ప్రారంభిస్తారు. కారుమంచి రెడ్డిరాక నాటి రాజరికాన్ని తలపించేలా ఉంటుంది. అతను తలపై పాగాతో యుద్ధ కత్తి చేతబట్టి గుర్రంపై మంది మార్భలం, మేళతాళాలు, కర్రలు, కత్తులతో రావడంతో ప్రత్యేకంగా ఉంటుంది.

దీన్ని చూడటానికి వేలాదిగా జనం తరలివస్తారు. భక్తిభావంతో ఆచారం -రవీంద్ర, కైరుప్పల, గ్రామంలో వీరభద్రర్వామి, కాళమ్మ జాతర మహోత్సవంలో ఏటా ఉగాది పండగ మరుసటి రోజున పెద్ద నూగ్గులాట జరుగుతుంది. గ్రామంలోని  ప్రజలందరూ రెండు వర్గాలుగా విడిపోయి పిడకల సమరాన్ని జరుపుకొంటాం. చిన్న నాటి నుంచి నేటివరకు క్రమం తప్పకుండా సమరంలో పాల్గొంటున్నా, భక్తి భావంతో ఉంటారు.