Duplicate E-Challans : ఏపీ సబ్ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో నకిలీ ఈ-చలానాలు

ఏపీలో ఫేక్‌గాళ్లు రెచ్చిపోతున్నారు. అవినీతిలో కొత్తదారులు తొక్కుతూ.. రాష్ట్ర ఖజానాకు కోట్లలో గండి కొడుతున్నారు.

Duplicate E-Challans : ఏపీ సబ్ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో నకిలీ ఈ-చలానాలు

Ap Chalan

AP Sub-Registrar offices : జిల్లా.. ఏరియాతో సంబంధం లేకుండా ఏపీలో ఫేక్‌గాళ్లు రెచ్చిపోతున్నారు. అవినీతిలో కొత్తదారులు తొక్కుతూ.. రాష్ట్ర ఖజానాకు కోట్లలో గండి కొడుతున్నారు. నకిలీ చలాన్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుండగా.. తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఏపీ రిజిస్ట్రేషన్ల శాఖలో చేరిన కేటుగాళ్లు.. ఒక్కొక్కరుగా చిక్కుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రేషన్‌ ఆఫీసు చలాన్లను CFMSకు అనుసంధానం చేసే క్రమంలో అన్ని జిల్లాల్లోనూ స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ తనిఖీలు చేపట్టడంతో భారీ కుంభకోణం వెలుగుచూసింది. స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు కోసం చెల్లించే చలానాలను కొందరు దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ కోసం బ్యాంకుల్లో చలానా తీసి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సమర్పించాక..కొందరు అవే చలానాలను మళ్లీ వినియోగిస్తున్నారని దర్యాప్తులో తేలింది.

సాంకేతిక లోపాన్ని ఆసరా చేసుకుని కేటుగాళ్లు ఈ నకిలీ ఈ చలానాల దందాను నడిపించారు. దీంతో సర్కార్‌ ఖజానాకు చేరాల్సిన లక్షల రూపాయలు పక్కదారి పట్టాయి. కర్నూలు సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆరు నెలల క్రితం ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌తో అధికారులు కుమ్మక్కయ్యారని విచారణలో తేలింది. జూన్, జులై నెలల్లో ఏపీలోని రిజిస్ట్రేషన్‌ ఆఫీసుల్లో సర్వర్లు మొరాయించిన సమయంలో ఈ చలానాల దోపిడీకి తెరదీశారు. వారం క్రితం కడప జిల్లాలో మోసం వెలుగు చూసిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో సోదాలు ముమ్మరం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జులై వరకు, నిరుడు ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు చలానాల ద్వారా జరిగిన ఫీజుల చెల్లింపులను పరిశీలించేకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి.

కృష్ణా జిల్లాలోని మండవల్లి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో కోటి 30 లక్షల రూపాయల మేర అవకతవకలు జరిగినట్లు తేలింది. విజయవాడ ఈస్ట్‌ జిల్లా రిజిస్ట్రార్‌ పరిధిలో 12 లక్షలు, విజయవాడ వెస్ట్‌ డీఆర్‌ పరిధిలో 54 లక్షలు, మచిలీపట్నం డీఆర్‌ పరిధిలో 77 లక్షల వరకు చలానాల ద్వారా కుంభకోణం గుర్తించారు. ఆ జిల్లా ఈ జిల్లా అని లేదు. పలు జిల్లాల్లోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలానాల దందా వెలుగుచూసింది. తాజాగా కడప సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో 10 బోగస్‌ చలానాలను గుర్తించారు. స్టాంపు డ్యూటీ రుసుమును డాక్యుమెంట్‌ రైటర్‌ జయరామకృష్ణ బోగస్‌ చలానాలతో స్వాహా చేసినట్లు తేలడంతో ఆయనపై ఫోర్జరీ, చీటింగ్‌ కేసు నమోదు చేశారు.

తొలుత కడపలో నకిలీ చలానాల దందా వెలుగుచూసిన సమయంలో ఒకే రైటర్‌ ద్వారా 290 చలానాలు మార్ఫింగ్ జరిగినట్లు దీంతో సర్కార్‌కు కోటికి పైగా నష్టం వాటిల్లినట్లు తేలింది. ఆ కేసులో ఒకర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు రిజిస్ట్రార్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను అధికారులు సస్పెండ్‌ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నకిలీ చలానాల వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. సబ్ రిజిస్టర్ సోఫియా బేగం, జూనియర్ అసిస్టెంట్ వీరన్నపై వేటుపడింది. మరో ఇద్దరిపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. మొత్తం ఆరుగురు డాక్యమెంట్ల రైటర్ల హస్తం ఉన్నట్లు గుర్తించారు అధికారులు.

గుంటూరు జిల్లా మంగళగిరి సబ్ రిజిస్ట్రార్‌ పరిధిలో 8 డాక్యుమెంట్లను నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు అధికారులు గుర్తించారు. CFMSలోని లోపాలను అనుకూలంగా మార్చుకుని ఈ తరహాలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ స్కామ్‌లో 8 లక్షల రూపాయలు రికవరీ చేశారు. సబ్‌ రిజిస్ట్రార్ రాధాకృష్ణ ఫిర్యాదుతో కొంతమంది డాక్యుమెంట్ రైటర్లని ప్రశ్నించారు పోలీసులు. డాక్యుమెంట్ల ప్రకారం 2లక్షల 15వేలు చెల్లించాల్సి ఉండగా..CFMSలో 15వేలు చలానా తీసి, దాని ప్రింట్‌ అవుట్‌లో ముందు రెండును యాడ్ చేసినట్లుగా గుర్తించారు. ఈ వ్యవహారంలో ముగ్గురు డాక్యుమెంట్ రైటర్ల పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నకిలీ చలానాల దందా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లు ఐదు నకిలీ చలానాలతో మోసానికి పాల్పడినట్లు గుర్తించారు అధికారులు. యమమదుర్రు, రుసుమర్రు గ్రామాలకు చెందిన దస్తావేజు లేఖర్లు… ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. మరో ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లు మేకల నరేష్, కౌరు పృథ్వీల నుంచి 6 లక్షల రూపాయలు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. మార్ఫింగ్ చలానాలతో రిజిస్ట్రేషన్ జరిగినట్టు కక్షిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే గోప్యంగా సంబంధిత కక్షిదారులకు, లేఖర్లకు సమాచారం ఇచ్చి ప్రభుత్వానికి తక్కువగా చెల్లించిన మొత్తాన్ని రిజిస్ట్రార్‌ కార్యాలయం అధికారులు రికవరీ చేశారు.

విజయనగరం జిల్లా గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల బాగోతం బయటపడింది. 21 లక్షల రూపాయలు విలువ చేసే 69 బోగస్ చలానాలు ఉన్నట్టు తేల్చారు అధికారులు. సబ్ రిజిస్ట్రార్ ఆర్.ఈశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెనపతి గణేష్ సహా.. మరో నలుగురిపై కేసు నమోదైంది. మాన్యువల్‌గా చలానా స్వీకరించి పీడీఎఫ్‌గా అప్‌లోడ్ చేసే క్రమంలో అక్రమాలు జరిగాయి. అలాగే చాలానాలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోనివారి చలానాలను దుర్వినియోగం చేశారు. నాలుగు రోజులుగా జరుగుతున్న తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఇందులో కీలక నిందితులు డాక్యుమెంట్ రైటర్లేనని అధికారులు గుర్తించారు.

CFMS, ఈ చలానా, ఈసీ, ఆర్‌.హెచ్‌, నకళ్లు, మార్కెట్‌ వాల్యూస్‌ పనులను సీనియర్‌ అసిస్టెంట్లు చేయాలి. అయితే ఈ పనులను ప్రైవేట్ వ్యక్తులే పంచుకుంటున్నారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దందాలు నడుస్తున్నాయి. స్టాంప్‌ డ్యూటీ సొమ్మును నకిలీ ఈ చలానా ద్వారా జేబులు నింపుకుంటున్నారు అక్రమార్కులు. కొన్ని ఆఫీసుల్లో సబ్ రిజిస్ట్రార్లే సూత్రధారులుగా ఉంటూ…మామూళ్లలో ప్రైవేట్‌ ఉద్యోగులు, సీనియర్‌ అసిస్టెంట్లకు వారం, నెలవారీ మామూళ్లు ముట్టు చెబుతున్నట్లు తెలుస్తోంది.