ఏపీలో ర్యాంకుల గోల… నాడు చంద్రబాబుని విమర్శించిన జగన్, నేడు ఎందుకింత మోజు పడుతున్నారు?

  • Published By: naveen ,Published On : September 10, 2020 / 02:35 PM IST
ఏపీలో ర్యాంకుల గోల… నాడు చంద్రబాబుని విమర్శించిన జగన్, నేడు ఎందుకింత మోజు పడుతున్నారు?

ఇప్పుడు ఏపీలో ర్యాంకుల రాజకీయం ఊపందుకుంది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ర్యాంకు వస్తే వాల్యూ లేదని వాదించేది నాటి ప్రతిపక్షం. ఇప్పుడు అదే ర్యాంకొస్తే.. అంతా మా క్రెడిట్‌ అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది అధికార పక్షం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్ ర్యాంకుల్లో వరుసగా మూడోసారి ఏపీకి అగ్రస్ధానం దక్కింది. టీడీపీ హయాంలో రెండు సార్లు రాష్ట్రం ఇదే ఘనత సాధించినప్పుడు అదంతా బాబు మార్క్‌ హంగామాగా అని అప్పటి ప్రతిపక్షం వైసీపీ కొట్టి పారేసింది. కానీ, అదే ర్యాంకు ఇప్పుడొస్తే.. అసలు ఫస్ట్‌ ర్యాంకు వచ్చింది తమ వల్లేనని చెప్పుకుంటోంది.

మిగతా రాష్ట్రాలకు పట్టని ఈ ర్యాంకులపై ఏపీకి ఎందుకింత మోజు?
మరోపక్క, 2019 ఏడాదికి ప్రకటించిన ర్యాంకుల్లో ప్రథమార్ధంలో అధికారంలో ఉన్న టీడీపీ కూడా క్రెడిట్‌ కోసం పాకులాడుతోంది. అదంతా తమ ఐదేళ్ల పాలన ఫలితమే అంటోంది. దీంతో అసలు ఈ ర్యాంకుల వెనుక ఏముందనే చర్చ రాష్ట్రంలో మొదలైంది. మిగతా రాష్ట్రాలకు పట్టని ఈ ర్యాంకులపై ఏపీకి ఎందుకింత మోజు? అంతిమంగా చంద్రబాబు పాలనను విమర్శించిన వైసీపీ కూడా అదే బాటలో సాగుతోందా అన్న చర్చ జరుగుతోంది.

మన దేశంలో అత్యంత వ్యాపార అనుకూల పరిస్ధితులున్న రాష్ట్రాలుగా మహారాష్ట్ర, గుజరాత్‌లు గుర్తింపు పొందాయి. కానీ, ఈ ర్యాంకుల్లో ఆ రెండు రాష్ట్రాలూ ఎక్కడో కిందన ఉంటాయి. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ కూడా జరుగుతోంది.

కియా వల్లే ఫస్ట్ ర్యాంకు వచ్చిందా?
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల ప్రకటనను గమనిస్తే తమ రాష్ట్రంలోకి వచ్చే వాస్తవ పెట్టుబడుల కంటే అవి వచ్చేస్తున్నాయని చేసుకునే ప్రచారమే కలిసొస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో భారీగా పరిశ్రమలు వచ్చేస్తున్నాయని, లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేస్తున్నాయని ఊదరగొట్టే వారు. వాస్తవానికి ఎక్కడో కియా వంటి ఒకటీ అరా పరిశ్రమలు మాత్రమే వచ్చాయి. సరిగ్గా ఇదే అంశం ప్రామాణికంగా ర్యాంకులు లభిస్తున్నాయా అంటే అవుననే సమాధానం పారిశ్రామిక వర్గాల నుంచి సైతం వినిపిస్తోంది.

పెట్టుబడులు అడుక్కోవడానికి టికెట్లు కొనుక్కొని వెళ్లాలా?
ఇలాంటి ప్రచారాలు అవసరం లేని వాణిజ్య రాష్ట్రాలైన గుజరాత్‌, మహారాష్ట్రలు ర్యాంకుల్లో వెనుకబాటుకూ ఇదే కారణమని అంటున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల్లో ఏపీ అగ్రస్ధానంలో నిలిచినప్పుడు విపక్షంలో ఉన్న వైసీపీ ఇదంతా బాబు మార్క్‌ హంగామాగా విమర్శలు చేసేది. అంతెందుకు పెట్టుబడుల ఆకర్షణ కోసం చంద్రబాబు ఏటా వెళ్లే దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుపైనా విమర్శలు గుప్పించేది. పెట్టుబడులు అడుక్కోవడానికి టికెట్లు కొనుక్కొని వెళ్లాలా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించేది.

వైసీపీకి ఎందుకీ ఆరాటం?
పెట్టుబడుల కోసం విశాఖలో నిర్వహించిన సదస్సులో లోటుపాట్లను గుర్తించి సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేసేది. తాము అధికారంలోకి వచ్చాక వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు ఆహ్వానం అందినా వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. కానీ, ఇప్పుడు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకులు రాగానే ఇదంతా తమ వల్లేనంటూ ప్రచారం మొదలు పెట్టిందని అంటున్నారు. గతంలో ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోని ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకులను వైసీపీ సర్కారు తొలిసారిగా క్రెడిట్‌ తమదేనని చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది.

ప్రభుత్వానికి ఆశాదీపంలా మారిన ర్యాంకులు:
రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానం ప్రకటించినా ఇప్పటివరకూ చెప్పుకోదగిన పరిశ్రమలేవీ రాష్ట్రానికి రాలేదు. వచ్చిన ఒకటీ అరా పరిశ్రమలు కూడా ఏపీతో కలిసి పని చేస్తామంటున్నాయి తప్ప రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధం కావడం లేదు. మరోవైపు కరోనా కారణంగా పెట్టుబడుల వాతావరణమే చెల్లా చెదురైంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఈజ్ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకులు ఏపీ ప్రభుత్వానికి ఆశాదీపంలా కనిపిస్తున్నాయట.

ఈవోడీబీ ర్యాంకుల్లో అగ్రస్ధానంలో ఉందన్న కారణంతో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోందని చెబుతున్నారు. కొసమెరుపు ఏంటంటే.. ఈ ర్యాంకుల్లోని డొల్లతనం ఏంటో దేశీయ, అంతర్జాతీయ పరిశ్రమలు నెలకొల్పే వారికి తెలుసు కాబట్టి అంత సీరియస్‌గా తీసుకోవడం లేదని అంటున్నారు.