Pallavi Modi : ప్రధానిని ప్రశ్నించిన తెలుగమ్మాయికి విద్యామంత్రి ఊహించని గిఫ్ట్

'పరీక్షా పే చర్చా' కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీతో వీడియో ద్వారా మాట్లాడి తన సందేహాన్ని వ్యక్తం చేసి సమాధానం పొందిన ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని పల్లవిని(9వ తరగతి) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అభినందించారు. పల్లవికి ఊహించని గిఫ్ట్ ఇచ్చారు.

Pallavi Modi : ప్రధానిని ప్రశ్నించిన తెలుగమ్మాయికి విద్యామంత్రి ఊహించని గిఫ్ట్

Pallavi Modi

Pallavi Modi : ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీతో వీడియో ద్వారా మాట్లాడి తన సందేహాన్ని వ్యక్తం చేసి సమాధానం పొందిన ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని పల్లవిని(9వ తరగతి) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అభినందించారు. ఆమె ఉన్నత విద్యకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. గురువారం(ఏప్రిల్ 8,2021) మార్కాపురం పట్టణం లక్ష్మీచెన్నకేశవనగర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యార్థినికి అభినందన కార్యక్రమం జరిగింది. తల్లిదండ్రులు మోహనరావు, సంపూర్ణ, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావుతో కలిసి వచ్చిన పల్లవితో మంత్రి మాట్లాడారు. ఎంతో ధైర్యంగా ప్రశ్న అడిగావు. ప్రధాని సమాధానం ఇచ్చారు. శభాష్‌ పల్లవి.. అంటూ మెచ్చుకున్నారు.

గిఫ్ట్ గా టీవీ, డిక్షనరీ:
భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నావని మంత్రి ప్రశ్నించగా డాక్టర్‌ కావాలనేది తన లక్ష్యమని పల్లవి చెప్పింది. చక్కగా చదువుకోవాలని, అందుకు సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థినితో పాటు తల్లిదండ్రులను సత్కరించారు. రూ.25వేల విలువ గల టీవీతో పాటు డిక్షనరీ బహూకరించారు.

ధైర్యంగా ప్రధానిని ప్రశ్నించిన పల్లవి:
‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని పల్లవి ఎంపికై తన సందేహాలను వీడియో ద్వారా ప్రధాని ముందుంచింది. ‘కరోనా ప్రభావంతో ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పరీక్షలు దగ్గర పడుతుండటంతో పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నాం. భయాన్ని వీడి ఏకాగ్రతతో పరీక్షలు రాసేందుకు ఉపాయం చెప్పండి’ని ఆమె కోరింది. దానికి ప్రధాని సమాధానం ఇచ్చారు.

పరీక్షలంటే భయపడొద్దు:
పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చా’ పేరుతో బుధవారం(ఏప్రిల్ 7,2021) వర్చువల్‌ విధానంలో ప్రధాని మాట్లాడారు. కష్టంగా అనిపించే పాఠ్యాంశాలను వదిలిపెట్టేయకుండా ఉదయాన్నే వాటిని చదవాలని, కాస్త సులభంగా అనిపించేవాటిని రాత్రిపూటైనా చూసుకోవచ్చని చెప్పారు. ‘‘పరీక్షలంటే భయపడవద్దు. మనల్ని మెరుగుపరచుకునేందుకు ఉపకరించేవిగా వాటిని చూడండి. కొన్నిసార్లు సామాజిక, కుటుంబ వాతావరణం కూడా విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తుంది. ఒత్తిడి లేకపోతే విద్యార్థులు పరీక్షలను భారంగా భావించరు. కష్టంగా అనిపించిన సబ్జెక్టుల నుంచి దూరంగా పారిపోవద్దు. నా వరకు నేను కష్టమైన పనిని ఉదయాన్నే చేస్తాను. అప్పుడైతే ప్రశాంతంగా ఉంటుంది. సులభమైన పనుల్ని రాత్రి పొద్దుపోయాక చేస్తుంటాను’’ అని ప్రధాని చెప్పారు. తన స్వీయ అనుభవాలను మేళవిస్తూ.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రధాని పలు సూచనలు చేశారు.