నేడే నోటిఫికేషన్‌.. రెండు రాష్ట్రాల్లో రెండు చోట్ల ఎన్నికల హీట్!

నేడే నోటిఫికేషన్‌.. రెండు రాష్ట్రాల్లో రెండు చోట్ల ఎన్నికల హీట్!

Elelction Notification

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి స్టార్ట్ అయ్యింది. తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీ, ఏపీలోని తిరుపతి పార్లమెంట్‌ సెగ్మెంట్‌ ఉప ఎన్నికలకు ఇవాళ(23 మార్చి 2021) నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు అధికారులు. మార్చి 30వ తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది. 31న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 17న ఉప ఎన్నికలు నిర్వహించి.. మే 2న కౌంటింగ్‌ నిర్వహిస్తారు.

తిరుపతి పార్లమెంట్‌ సెగ్మెంట్‌ ఉపపోరుకు బీజేపీ మినహా ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించాయి. అక్కడ వచ్చే రిజల్ట్‌ దేశమంతా మారుమోగాలని నేతలకు ఇప్పటికే సూచించారు సీఎం జగన్‌. వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి బరిలో ఉన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన టీడీపీ.. తిరుపతి ఉప ఎన్నికలో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. పనబాక లక్ష్మి పేరును ఆ పార్టీ ఎప్పుడో ఖరారు చేసింది. బీజేపీ మాత్రం అభ్యర్ధిని ప్రకటించలేదు. తిరుపతిలో బీజేపీ-జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి.

ఏప్రిల్ 17న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితం వెలువడనుంది. ఇప్పటికే వైసీపీ డాక్టర్‌ గురుమూర్తికి టికెట్ ఖరారు చేయగా.. టీడీపీ నుంచి పనబాక లక్ష్మి పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ-జనసేన అభ్యర్థిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలతో హీటెక్కిన నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో వేడి మొదలైంది.

నాగార్జున సాగర్‌లోనూ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. కాంగ్రెస్ తరపున జానారెడ్డి ఈనెల 30న నామినేషన్‌ వేయనున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. టీఆర్‌ఎస్‌ నుంచి నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్, రంజిత్ యాదవ్, గురవయ్య యాదవ్‌ పేర్లను పరిశీలిస్తోంది పార్టీ. బీజేపీ కూడా తమ అభ్యర్థిని ఖరారు చేయలేదు.