సర్పంచ్ అభ్యర్థి గుర్తుపై నోటా..ఎన్నికల అధికారుల నిర్వాకం

సర్పంచ్ అభ్యర్థి గుర్తుపై నోటా..ఎన్నికల అధికారుల నిర్వాకం

Nota on Sarpanch Candidate Symbol : ఏపీ తొలి విడత పంచాయతీ ఎలక్షన్స్ లో అధికారుల నిర్వాకం బయటపడింది. కృష్ణా జిల్లా నిడమానూరులో సర్పంచ్ అభ్యర్థి శీలం రంగారావు గుర్తుపై నోటా అంటించారు. అధికారులపై సర్పంచ్ అభ్యర్థి శీలం రంగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిచేస్తామని అధికారులు అభ్యర్థికి సర్దిచెప్పారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’ను అందుబాటులోకి తెచ్చారు.

విజయవాడ రెవిన్యూ డివిజన్‌లోని చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనమలూరు, పెనుగంచిప్రోలు, తోట్లవల్లూరు, వత్సవాయి, వీర్లపాడు, విజయవాడలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి.

నెల్లూరు జిల్లా అల్లూరు మండలం శంభునిపాలెం గ్రామస్థులు మూకుమ్మడిగా ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామ రిజర్వేషన్ల ప్రక్రియలో ఎస్సీలుగా ఉన్న తమను ఓసీలుగా చూపుతూ కుట్ర పన్నారని గ్రామస్థులు ఆరోపించారు. నామినేషన్‌ వేసిన తర్వాత తమ కులాన్ని మార్చి
వేసి…వేరే అభ్యర్థిని పోటీలో పెట్టారని చెబుతున్నారు.

ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. విజయనగరం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ‘నోటా’ను అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరుగనుంది. కరోనా పాజిటివ్‌ బాధితులకు పీపీఈ కిట్లతో చివరిలో గంటసేపు అవకాశం కల్పించనున్నారు.

తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ చేయగా 525 చోట్ల సర్పంచి ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. నెల్లూరు జిల్లా వెలిచెర్ల గ్రామంలో సర్పంచి పదవికి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మిగిలిన 2,723 చోట్ల సర్పంచి, 20160 వార్డులకు పోలింగ్ జరుగనుంది.

పోలింగ్ పర్యవేక్షణకి విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. సర్పంచ్ అభ్యర్థికి పింక్ బ్యాలెట్, వార్డు అభ్యర్థికి తెల్ల బ్యాలెట్‌ను కేటాయించారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నిక ఉంటుంది.