ఆ గ్రామంలో తొలిసారి ఎన్నికలు | Elections for the first time

ఆ గ్రామంలో తొలిసారి ఎన్నికలు..

ఆ గ్రామంలో తొలిసారి ఎన్నికలు..

Elections for the first time : కర్నూలు జిల్లా నంద్యాల మండలం భీమవరంలో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పంచాయతీ 1956లో ఏర్పాటు కాగా.. ప్రతి సారి గ్రామస్తులంతా ఒకేతాటిపై ఉండి ఏకగ్రీవం చేసుకుంటూ వచ్చారు. 65 సంవత్సరాలుగా ఊరి వారంతా ఒకే మాటపై ఉంటున్నారు. కానీ ఈసారి మాత్రం ఓటు వేసేందుకు నిర్ణయించుకున్నారు. మొదటిసారి అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఏడేళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికలు ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే 12శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో.. సర్వత్రా ఆసక్తి నెలకొంది.

విజయనగరం జిల్లా మినహా 12 జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3గంటల 30 నిమిషాల వరకు పోలింగ్‌ జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించి విజేతలకు డిక్లరేషన్లు అందజేస్తారు. వీలైతే ఇవాళే ఉపసర్పంచ్‌ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశముంది. లేకపోతే రేపు ఉపసర్పంచ్‌ ఎన్నికలు నిర్వహిస్తారు.

నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటి గంటా 30 నిమిషాల వరకే ఎన్నికలు జరగనున్నాయ్‌. సమస్యాత్మక గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు అధికారులు. మొదటి విడతలో 2వేల 723 సర్పంచ్‌ స్థానాలకు, 20వేల 157 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్‌ అభ్యర్థులుగా 7వేల 506 మంది, వార్డులకు 43వేల 601 మంది పోటీపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటాను తీసుకొచ్చారు.

×