274 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు లేనట్లే!

274 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు లేనట్లే!

Elections have been stopped in 274 panchayats : ఏపీలో 274 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఆగిపోయాయి. నాలుగు విడతల్లో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామాల ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో మొత్తం 13,371 గ్రామ పంచాయతీలున్నాయి. తొలి విడతలో 3,249 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నెల 13న రెండో విడతలో 3,328 పంచాయతీలకు, ఈ నెల 17న మూడో విడతలో 3,221 పంచాయతీల్లో పోలింగ్‌ జరుగనుంది. ఈ నెల 21న నిర్వహించే నాలుగో విడతగా 3,299 గ్రామాల్లో ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ నాలుగు విడతల్లోను ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయనివి 274 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 69 ఉన్నాయి. ఏడాది కిందట పెద్ద గ్రామ పంచాయతీలుగా ఉన్న వాటిని పలుచోట్ల స్థానికుల డిమాండ్‌ మేరకు రెండుగా వర్గీకరించారు. అనంతరం ఆయా పంచాయతీల్లో వార్డుల విభజన జరుగలేదు. దీంతో వాటిలో ఎన్నికలు నిర్వహించడంలేదు. కొన్ని పంచాయతీలకు సంబంధించి కోర్టుల్లో కేసులున్నాయి. అందువల్ల ఈ పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించడం లేదు.

ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ జారీ అయిన తరువాత కూడా వివిధ కారణాలతో మరికొన్ని పంచాయతీల్లో ఎన్నికలు ఆగిపోయాయి. మొదటి విడతలో నోటిఫికేషన్‌ జారీ చేసినా సర్పంచ్, వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో నెల్లూరు జిల్లా వెలిచర్ల పంచాయతీలో ఎన్నికలు నిలిచిపోయాయి. రెండో విడత నోటిఫికేషన్‌ ఇచ్చిన పంచాయతీల్లోనూ మూడు చోట్ల ఎన్నికలు నిలిచిపోయినట్లు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు తెలిపారు.

మూడో విడత ఎన్నికలు జరగనున్న 3,221 పంచాయతీల్లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. అనంతరం ఎంతమంది పోటీలో ఉన్నారన్న స్పష్టత రానుంది. నాలుగో విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.