Tirumala Elephants : తిరుమల ఘాట్ రోడ్డులో హడలెత్తిస్తున్న ఏనుగుల సంచారం
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల సంచారం తిరుమల వెళ్లే భక్తులను కలవర పెడుతోంది. ఇప్పటివరకు ఘాట్ రోడ్ లో చిరుత పులులు, జింకలు, దుప్పులు, రేసుకుక్కలు, ఎలుగుబంట్లు మాత్రమే కనిపించేవి

elephants menace Tirumala Ghat Roads
Tirumala Elephants : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల సంచారం తిరుమల వెళ్లే భక్తులను కలవర పెడుతోంది. ఇప్పటివరకు ఘాట్ రోడ్ లో చిరుత పులులు, జింకలు, దుప్పులు, రేసుకుక్కలు, ఎలుగుబంట్లు మాత్రమే కనిపించేవి అయితే గత మూడు రోజులుగా ఘాట్ రోడ్డులో ఏనుగులు సంచరిస్తున్నాయి. దీంతో వాహనచోదకులు భయాందోళనలకు గురవుతున్నారు. ఏనుగుల సంచారం కారణంగా శనివారం రాత్రి అర్ధ గంట పాటు తిరుపతికి వెళ్లే వాహనాలను నిలిపివేశారు. ఏనుగులు భక్తులకు ఎటువంటి హాని తలపెట్టకపోయినా అవి భక్తులపై ఎక్కడ దాడి చేస్తాయో అని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం కొత్త విషయం ఏమి కాదు.. కుప్పం, పలమనేరు ప్రాంతాల్లో నిత్యం ఏనుగులు కనిపించడం పంటపొలాలను ధ్వంసం చేయడం సర్వసాధారణమే.. అయితే కొత్తగా ఇపుడు తిరుమల కొండ పైన ఏనుగులు కనిపించడం కలకలం రేకెత్తిస్తోంది. తిరుమల నుండి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల ఆర్చి, ఏడో మైలు ఆంజనేయస్వామి విగ్రహం ప్రాంతాల్లో గత మూడు రోజులుగా ఏనుగులు సంచరిస్తున్నాయి.
శనివారం రాత్రి ఏనుగులు రోడ్డుపైకి రావడంతో ఆ సమయంలో తిరుపతికి వెళ్లే వాహనచోదకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏనుగులు కనపడిన విషయం తిరుమలకు సమాచారం ఇవ్వడంతో తిరుమలలోని జీఎన్‌సి టోల్‌గేట్ వద్ద అర్ధగంట పాటు వాహనాలను నిలిపివేశారు. అనంతరం ఏనుగులను అడవిలోకి తరిమి వేసిన తరువాత వాహనాలు యధావిధిగా అనుమతించారు.
అయితే సోమవారం తెల్ల వారుఝూమున ఐదు ఏనుగుల గుంపు 7వ మైలు రాయి ప్రాతం… అలిపిరి ఫుట్‌పాత్‌లోని మీటింగ్ పాయింట్, మొదటి ఘాట్ రోడ్డు వద్ద సంచరిస్తూ కనిపించింది. టీటీడీ అడిషనల్ ఈవో ఏవీ ధర్మారెడ్డి, అటవీశాఖ అధికారులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లగా అక్కడ ఏనుగులు కనిపించాయి, ఇంకా కొన్ని ఫుట్‌పాత్‌కు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. ఫుట్‌పాత్ మరియు ఘాట్ రోడ్డు నుండి వాటిని అడవుల్లోకి తరిమికొట్టడానికి అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు.
పలువురు భక్తులు, స్థానికులు, ఏనుగుల సంచరిస్తున్న దృశ్యాలను మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. అయితే ఏనుగుల సంచారం పట్ల టీటీడీ భక్తులను అప్రమత్తం చేసింది. భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈ వో ధర్మా రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ గత మూడు రోజులుగా ఏనుగుల గుంపు ఘాట్ రోడ్ లో సంచరిస్తోందని ఏనుగులు వాటంతటవే వెళ్లిపోతాయి లేదా పంపించడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
2020 సంవత్సరంలో కరోనా లాక్ డౌన్ సందర్భంగా కూడా ఘాట్ రోడ్ లో ఏనుగులు తిరగడం పలువురు చూశారు. తిరుమలలోని పార్వేట మండపం ప్రాంతంలో గతంలో ఏనుగులు సంచరించిన సందర్భాలున్నాయి. ఏడాదిలో ఒకటి, రెండుసార్లు తిరుమల సమీపంలోకి ఏనుగులు రావడం జరుగుతోంది. అయితే ఏనుగులు భక్తులకు ఎప్పుడూ హాని చేసిన ఘటనలు మాత్రం లేవు.
Also Read : Statue of Equality: ముచ్చింతల్‌కు అమిత్ షా.. 7వ రోజు కార్యక్రమాలు ఇవే!
ప్రస్తుతం మాత్రం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో సంచరిస్తున్న ఏనుగులు ఘాట్ రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద సంచరిస్తున్నాయి సమీపంలో నీటి కుంట ఉండడంతో అక్కడ కాసేపు ఉండి మళ్లీ రోడ్డు సమీపంలోకి వస్తున్నాయి. అయితే టిటిడి మాత్రం ఏనుగుల సంచారాన్ని సీరియస్ గా తీసుకుంది. ఏనుగులు రోడ్ల మీదకు రాకుండా ఉండేందుకు ఫారెస్ట్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఏనుగుల్ని దూరంగా తరిమివేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.