ఏపీలో ఎంప్లాయిస్ పాలిటిక్స్ : ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన ఉద్యోగుల కొట్లాట

ఏపీలో ఎంప్లాయిస్ పాలిటిక్స్ : ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన ఉద్యోగుల కొట్లాట

Employees Politics in AP : ఏపీలో ఉద్యోగ సంఘాల పోరు మరోసారి రచ్చకెక్కింది. ఆధిపత్య పోరులో ఉద్యోగులు నలిగిపోతుండగా.. ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందీ ప్రాబ్లమ్‌. సమస్యల పరిష్కారాన్ని పక్కన పెట్టి మరీ.. ఘర్షణలకు దిగుతున్నారంటే ఉద్యోగ సంఘాల్లో పాలిటిక్స్‌ ఏమాత్రం పీక్స్‌కు చేరుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఉద్యోగ సంఘాల నేతలు ఇదంతా చేస్తున్నది దేనికోసం..? ఎందుకోసం..? ఉద్యోగ సంఘాల నేతలది ఆధిపత్యమా.. అహంకారమా..?

ఏపీ ఉద్యోగ సంఘాల నాయకుల ఆధిపత్య పోరు.. రాజకీయాలను మించి రక్తి కడుతోంది. ఏపీలో నాలుగు ప్రధాన ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. రెవిన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చైర్మన్‌గా ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ సెక్రటేరియట్‌ ఎంప్లాయిస్ అసోషియేషన్‌కు వెంకట్రామిరెడ్డి అధ్యక్షుడుగా ఏపి గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షులుగా ఏపీ ఎన్జీవో అసోషియేషన్, సూర్యనారాయణ అధ్యక్షుడిగా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోషియేషన్లు పెద్ద ఉద్యోగ సంఘాలుగా ఉన్నాయి.

వీరిలో అప్స అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వైసీపీ సానుభూతిపరుడు. చంద్రబాబు పాలనలో సెక్రెటరియేట్‌లోని ముఖ్య సమాచారాన్ని వైసీపీకి చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో సస్పెన్షన్ వేటుకు కూడా గురయ్యారు. ఇక సూర్యనారాయణ బీజేపీకి అనుకూలంగా ఉన్నారని.. చంద్రశేఖర్ రెడ్డి నాలుగు నెలల్లో రిటైర్డ్ అయి.. వైసీపీలో చేరే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాత్రం ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి.. తమ సంఘంలోని ఉద్యోగుల పనులు జరిపించుకునే రకమనే ప్రచారం ఉంది.

ఇక ఎవరి సంఘాలను వారు బలోపేతం చేసుకునేందుకు చేస్తున్న పోరులో.. మధ్యలో ఉద్యోగులు నష్టపోతున్నారు. గత మూడేళ్లుగా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని జూనియర్ అసిస్టెంట్లు, వీఆర్వోల ప్రమోషన్లు ఆగిపోయాయి. వీరిలో కొందరు బొప్పరాజు పక్షాన.. మరి కొందరు వెంకట్రామిరెడ్డి పక్షాన వున్నారు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. వీరి మధ్య ఆధిపత్య పోరుతో ఎటువైపు మొగ్గాలో తెలియక ఉద్యోగ నేతలు తలలు పట్టకుంటున్నారు. ఇటీవల సెక్రెటరియేట్‌లో జూనియర్ అసిస్టెంట్లు, వీఆర్వోల ప్రమోషన్ వ్యవహారం తేల్చేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ సెక్రెటరీ ఆదిత్యనాథ్‌ దాస్ సమావేశమయ్యారు. అర్ధరాత్రి వరకూ ఈ సమావేశం సాగినా.. హాజరైన నాలుగు సంఘాల నాయకుల్లో ఏకాభిప్రాయం కుదరలేదు.

అందరూ ఒకే మాటపైకి రాకపోగా.. సమావేశంలో మాటా మాటా పెరిగింది. సమావేశం అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి, ఆదిత్యనాథ్‌ దాస్‌ డోర్ దాటి వెళ్లకముందే వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు బాహాబాహికి దిగారు. కొంత తోపులాట కూడా జరిగింది. ఇది తెలిసిన సజ్జల ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇద్దరూ బలమైన ఉద్యోగ సంఘాల నేతలే కావడంతో.. ఏ ఒక్కరినీ దూరం చేసుకొనే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఈ వ్యవహారం సీఎం జగన్‌ దృష్టికి కూడా వెళ్లింది. అయినా ప్రభుత్వ పెద్దలు ఉద్యోగ సంఘాల మధ్య తలతెత్తిన విభేదాలను పరిష్కరించడంపై దృష్టిపెట్టడం లేదు. దీంతో వైషమ్యాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి.

రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లోని జూనియర్ అసిస్టెంట్లు, వీఆర్వోల ప్రమోషన్ వ్యవహారం వీరి పోరుకు వేదిక అవుతోంది. తమ సమావేశం జరగకుండా వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ, ఎమ్మెల్సీ అశోక్ బాబు అడ్డుకొనే ప్రయత్నం చేశారని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులు తమ సమావేశానికి వెళ్లవద్దని వీరు ముగ్గురు ఫోన్లు చేసి బెదిరించాంటున్నారు బొప్పరాజు. అయితే బొప్పరాజు ఆరోపణలను మిగతా నేతలు తీవ్రంగా ఖండించారు. ఆ సమావేశం జరుగుతున్నట్లే తనకు తెలియదని ఎమ్మెల్సీ అశోక్ బాబు కొట్టిపారేశారు. గొడవ పెట్టుకొని తనపై చెడు అభిప్రాయం తీసుకురావాలనే బొప్పరాజు కుట్రలు చేస్తున్నారని వెంకట్రామిరెడ్డి ఆరోపిస్తున్నారు. దీనితో ప్రభుత్వ పెద్దలకు ఉద్యోగ సంఘాల గొడవ తలనొప్పిగా మారింది.

ఉద్యోగ సంఘాల నేతల సమస్యల పరిష్కారం కంటే.. తమ పంతాలకే ప్రాధాన్యతనిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలను అడ్డుపెట్టుకొని తమ రాజకీయ భవిష్యత్‌కు రాజబాటులు వేసుకునేందుకు గతంలోనూ.. ఇప్పుడుకూడా పలువురు రాజకీయ నేతలు వారిని పావులుగా వాడుకుంటున్నారే విమర్శలున్నాయి. ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు కుల సంఘాలుగా, మత సంఘాలుగా విడిపోయాయి. గతంలో పనిచేసిన నాయకులు నిస్వార్థంగా పనిచేసి పదవులకే వన్నె తెస్తే.. నేటి నాయకులు కులాల కుళ్లు, మతాల కంపుతో భ్రష్టు పట్టిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఉద్యోగ సంఘాల మధ్య పంతాలతో.. ఉద్యోగులు నష్టపోకుండా ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. లేకుంటే పోట్ల గిత్తల పోరులో లేగదూడలు నలిగినట్లు.. మధ్యలో ఉద్యోగులు ప్రమోషన్లు ఆగిపోయి, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌లు నష్టపోయే ప్రమాదం ఉంది.