బాకీ తీర్చమన్నందుకు, అప్పు ఇచ్చిన వ్యక్తి దారుణ హత్య

బాకీ తీర్చమన్నందుకు, అప్పు ఇచ్చిన వ్యక్తి దారుణ హత్య

అప్పు ఇచ్చిచావుకొని తెచ్చుకున్న చందంగా మారింది ఒక రిటైర్డ్ ఉద్యోగి పరిస్ధితి. రాజకీయ నాయకుడికి అప్పుఇచ్చి…డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఆ వ్యక్తిని హతమార్చాడా నాయకుడు. కడపజిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని మహాత్మానగర్ లో నివాసం ఉండే  బొలిశెట్టి వెంకటరమణ(60) ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. అతనికి భార్య, కుమారుడు, కుమర్తె ఉన్నారు.

రిటైరైన తర్వాత వచ్చిన డబ్బులకు మరికొంత కలిపి వాటిని  వెంకటరమణ వడ్డీలకు తిప్పుతున్నాడు. అందులో భాగంగా ఎర్రగుంట్ల పంచాయతీ మాజీ మున్సిపల్ చైర్మన్ ముసలయ్యకు కూడా అప్పు ఇచ్చాడు. అతనికి ఇచ్చిన అప్పు ఇటీవల వడ్డీతో సహా రూ.30 లక్షలకు చేరుకుంది.  ఈ డబ్బు తిరిగి ఇవ్వాలని రమణయ్య పలుమార్లు  అడిగాడు. అయినా ముసలయ్య డబ్బులు తిరిగి ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అప్పు తీర్చమని రమణయ్య నుంచి  ఒత్తిడి ఎక్కువ అవటంతో  అడ్డుతొలగించుకోవాలనుకున్నాడు.

జూన్ 20న మహాత్మానగర్ లోనే ఉన్న తన ఇంటికి రావాలని ముసలయ్య, రమణయ్యకు చెప్పాడు.  అప్పటికే అక్కడ  ముసలయ్య కొంతమంది కిరాయి వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నాడు. ముసలయ్య ఇంటికి వచ్చిన రమణయ్యను కిరాయి హంతకుల సాయంతో హత్య చేశాడు. తలను మొండాన్నివేరు చేసి….మొండాన్ని తన ప్రాంగణంలోనే మరుగుదొడ్డి సమీపంలో పాతిపెట్టాడు. తలను ఒక స్టీల్ డబ్బాలో పెట్టుకుని తన బంధువుల సహాయంతో 50 కిలో మీటర్ల దూరంలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డువద్దకు తీసుకువెళ్లి అక్కడ అడవిలో పడేశాడు.

రెండు రోజులుగా వెంకటరమణయ్య కనిపించకపోవటంతో అతని తమ్ముడు రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటరమణయ్య ఫోన్ కాల్స్  పరిశీలించి ముసలయ్యను అదుపులోకి తీసుకుని  విచారించారు.  అప్పుతీర్చమన్నందుకే వెంకటరమణయ్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. పాతి పెట్టిన  మొండెంను ముసలయ్య  ఇంటినుంచి బుధవారం జూన్ 24న వెలికితీశారు. ఘాట్ రోడ్డు వద్ద అడవిలో పడేసిన  తలను తీసుకువచ్చారు. ఈ ఘటనలో పాల్గోన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

kdp venkataramanaiah