AP : ఏపీలో డే కర్ఫ్యూ పొడిగింపు..ఎప్పటి వరకు అంటే

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కర్ఫ్యూను పొడిగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

AP : ఏపీలో డే కర్ఫ్యూ పొడిగింపు..ఎప్పటి వరకు అంటే

Ap

Extension Of Day Curfew : ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కర్ఫ్యూను పొడిగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఆ దిశగా నిర్ణయం తీసుకోకుండా..డే కర్ఫ్యూను నెలాఖరు వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు.

2021, మే 17వ తేదీ సోమవారం ఉదయం కరోనా కట్టడి, తదితర వాటిపై చర్చించేందుకు సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. కరోనా కేసులు తగ్గాలంటే..కనీసం నాలుగు వారాలు ఎదురు చూడాల్సిన అవసరం ఉందన్నారు సీఎం జగన్.

రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. కోవిడ్ కారణంగా ఎవరైనా తల్లిదండ్రులు చనిపోతే..పిల్లలను ఆదుకొనేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లల పేరిట కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసి..వచ్చే వడ్డీని పిల్లల కోసం ఉపయోగించాలన్నారు. వాలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.

ఏపీలో ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కఠిన కర్ఫ్యూ అమలవుతుంది. ఈ నెల 05వ తేదీన కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. సడలింపు సమయంలో ప్రజలు భారీగా బయటకు వస్తున్నారు. మార్కెట్లలో గుంపులుగా తిరుగుతుండటంతో వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. నాలుగు వారాల పాటు కర్ఫ్యూను పెట్టాలని, లాక్ డౌన్ పెట్టాలనే ఆలోచన లేదని ప్రభుత్వం వెల్లడించింది. కర్ఫ్యూను మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం జగన్ స్ఫష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

దేశంలో కొత్త కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు మొదటిస్థానంలో ఉండగా.. ఏపీ రెండో స్థానంలో కొనసాగుతుంది. చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ సైతం తెలిపింది. ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన ఫీవర్ సర్వేలో సైతం రాష్ట్రంలో పాజిటివిటి రేటు 20 శాతం దాటినట్టు తేలింది.

Read More : US Google Pay Users : అమెరికా గూగుల్ పే యూజర్లు ఇండియాకు డబ్బులు ఇలా పంపొచ్చు..