శ్రీవారి భక్తులకు అదనపు భారం..భారీగా పెరిగిన అలిపిరి టోల్‌గేట్ ఛార్జీలు

శ్రీవారి భక్తులకు అదనపు భారం..భారీగా పెరిగిన అలిపిరి టోల్‌గేట్ ఛార్జీలు

increased Alipiri tollgate charges : కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమలను సందర్శించడానికి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు కొత్తగా మోతబరువు పడింది. అలిపిరి టోల్‌గేట్ ఛార్జీలు భారీగా పెరిగాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుమలకు వెళ్లే వాహనాలన్నీ అలిపిరి వద్ద ఉన్న ఈ టోల్‌గేట్ మీదుగానే ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం టోల్‌గేట్ వద్ద వసూలు చేస్తోన్న ఛార్జీలను టీటీడీ అధికారులు భారీగా పెంచారు.

సగటున రోజూ 10 వేలకు పైగా వాహనాలు టోల్‌గేట్ మీదుగా తిరుమలకు వెళ్తుంటాయి. వారాంతపు రోజులు, పండుగలు ఇతర ప్రత్యేక దినాల్లో ఈ సంఖ్య భారీగా ఉంటుంది. ఆయా వాహనాల నుంచి టోల్ ఛార్జీలను వసూలు చేయడానికి అలిపిరి వద్ద ప్రత్యేక వ్యవస్థను టీటీడీ అధికారులు ఇదివరకు ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు నామమాత్రంగా వాహనాల ఛార్జీలను వసూలు చేస్తున్నారు. దశలవారీగా ఆ ఛార్జీలను పెంచారు. తిరుమలేశుడిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వాహనాల మీద వచ్చే భక్తులకు ఈ చార్జీల పెంపు పెనుభారంగా మారింది.

ఇప్పటిదాకా కనిష్ఠంగా 15 రూపాయలు, గరిష్ఠంగా 100 రూపాయలను టోల్ ఛార్జీ కింద వసూలు చేసేవారు. ఇప్పుడిది రెట్టింపైంది. కనిష్ఠ ఛార్జీ 50 రూపాయలు, గరిష్ఠ చార్జీ 200 రూపాయలకు పెరిగింది. ఇప్పటిదాకా అమల్లో ఉన్న టోల్ ఛార్జీల ప్రకారం.. భక్తులు రాకపోకలు సాగించే వ్యక్తిగత కారుపై 15 రూపాయల నామమాత్రపు ఛార్జీని వసూలు చేసే వారు. ఇప్పుడు 50 రూపాయలకు పెంచారు. టాక్సీపై 25 రూపాయలు, సొంత జీపుపై వచ్చే వారి నుంచి 30 రూపాయలను తీసుకునే వారు.

ట్యాక్సీ, సుమో, ట్రాక్స్ వంటి కమర్షియల్ వాహనాలపై శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తుల నుంచి 50 రూపాయల ఛార్జీని వసూలు చేస్తుండేవారు. హెచ్‌బీ మినీ లారీ-50, రాష్ట్ర పర్యాటకాభివ‌ద్ధి సంస్థకు చెందిన బస్సులపై గరిష్ఠంగా 100 రూపాయల ఛార్జీని విధించే వారు. ఇప్పడవన్నీ పెంచారు. శ్లాబులు, వాహనాలవారీగా టోల్‌గేట్ ఛార్జీలో పెరుగుదల నమోదైంది. ఈ టోల్ గేట్.. టీటీడీ సెక్యూరిటీ విభాగం ఆధీనంలో ఉంటుంది.