కట్నం వద్దంటాడు… కోట్లు కొల్లగొట్టేస్తాడు….నకిలీ ఆర్మీ అధికారి అరెస్ట్

10TV Telugu News

fake army officer arrested : చదివింది టెన్త్..చేసిన మోసాలు 17కిపైగా…. వసూలు చేసింది రూ. 8కోట్లకు పైమాటే. ఆర్మీ మేజర్ నంటూ పెళ్లి పేరుతో ఆడపిల్లలను మోసం చేస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రకాశం జిల్లా మండ్లమూరు మండలం, కెల్లంపల్లి గ్రామం, పలుకురాళ్ల తండాకు చెందిన ముదావత్ శ్రీను నాయక్ (42) 2002 లో అదే ప్రాంతానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమె గుంటూరు జిల్లా లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ కేడర్ లో ఉద్యోగం చేస్తోంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పడతను ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.కొన్నిరకాల కోర్సులు చేస్తే తేలిగ్గా ప్రభుత్వం ఉద్యోగాలు వస్తాయని…..సరైన ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్న భర్తకు భార్య సలహా ఇచ్చింది. అందుకు అవసరమైన కోచింగ్ తీసుకోటానికి 2014లో హైదరాబాద్ వచ్చాడు శ్రీను నాయక్. ఉప్పల్ లో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. హైదరాబాద్ వచ్చి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. అందుకోసం మోసాలు చేయటం మొదలెట్టాడు.

ఆర్మీలో ఈఎంఈ విభాగంలో మేజర్ గా పనిచేస్తున్నాననంటూ నకిలీ ఐడీ తయారు చేయించాడు. ఆర్మీ యూనిఫారంతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టుకుని ప్రచారం చేసుకున్నాడు. శ్రీనివాస చౌహాన్ అనే పేరుతో నకిలీ ఆధార్ కార్డ్ సంపాదించాడు. అసలు పుట్టిన తేదీ 12-07-1979 అయితే దానిపై 27.08.1986 అని పుట్టిన తేదీ వేయించాడు.మేజర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు, నకిలీ ఐడీ కార్డులు చూపించి మ్యారేజి బ్యూరోలలో పెళ్లి సంబంధాల వెతకటం మొదలెట్టాడు. ఉప్పల్ నుంచి తన మకాం సైనిక్ పురికి మార్చాడు. ఫూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో డిగ్రీ చేసినట్లు నకిలీ సర్టిఫికెట్ పుట్టించాడు. చెన్నై ఐఐటీలో చదివినట్లు మరో సర్టిఫికెట్ తయారు చేయించాడు.

ఇవి అన్నీ చూపిస్తూ మ్యారేజి బ్యూరోల సాయంతో తమ సామాజిక వర్గానికి చెందిన అవివాహిత యువతుల వివరాలు సేకరించేవాడు. ధనవంతులను టార్గెట్ చేసుకుని ఖరీదైన కారులో వారి ఇళ్లకు పెళ్ళి చూపులకు వెళ్లేవాడు. తనకు కట్న కానుకలు వద్దని నమ్మించేవాడు. ఆతర్వాత అర్జంట్ గా డబ్బు అవసరం ఉందని. ఆదాయపన్ను కట్టాలని చెప్పి వారి వద్ద అందిన కాడికి దోచుకుని వారికి కనపడకుండా పారిపోయేవాడు.ఈ మోసగాడు చివరికి తన భార్యనూ మోసం చేశాడు. ఐటీ కట్టాలంటూ భార్య వద్ద నుంచి రూ.16 లక్షలు తీసుకున్నాడు. పెళ్లి పేరుతో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ నుంచి రూ.56 లక్షలు, సెక్రటేరియట్ ఉద్యోగిని నుంచి రూ.52 లక్షలు, పీజీ చదివిన యువతి నుంచి రూ.70 లక్షలు కాజేశాడు.

ఇటీవల వరంగల్ కు చెందిన ఎంబీఏ చదివిన యువతిని ఇలానే నమ్మించాడు. ఆమె తండ్రి నుంచి రూ.2.01 కోట్లు వసూలు చేశాడు. ఇలా పలువురు వద్దనుంచి దాదాపు రూ. 8.25 కోట్లు వసూలు చేశాడు. ఈ డబ్బుతో సైనిక్ పురిలో విల్లా, ఖరీదైన కార్లు కొనుగోలు చేశాడు.ఐఐటీ ఖరగ్ పూర్ లో చదివిన యువతిని ఇటీవల పరిచయం చేసుకుని ఆమెను పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయువతి ఇతడి గురించి చెన్నై ఐఐటీలో ఎంక్వైరీ చేయగా ఇతను చెప్పేది అంతా అబద్దం అని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఉత్తర మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని శనివారం అరెస్ట్ చేశారు. అతని వద్దనుంచి సైనిక్ పురిలోని ఖరీదైన విల్లా, మూడు లగ్జరీ కార్లు, మూడు డమ్మీ పిస్టల్స్, మూడు జతల ఆర్మీ ఫ్యాటిగ్, నకిలీ ఆర్మీ కార్డు, నకిలీ సర్టిఫికెట్లు ఇతర డాక్యుమెంట్లు, రూ.85 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా…వరంగల్‌కు చెందిన యువతితో ఇతడికి ఆదివారం నవంబర్22న నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఇతడిపై వరంగల్, రాచకొండల్లో రెండు కేసులు ఉన్నాయి. నిందితుడిని బొల్లారం పోలీసులకు అప్పగించారు.


10TV Telugu News