కర్నూలులో అమానుషం, గర్భిణి మృతదేహాన్ని అడవుల్లో చెట్టుకి కట్టేశారు

ఆచారాలు, కట్టుబాట్ల పేరుతో కర్నూలు జిల్లాలో అమానుష ఘటన జరిగింది. గర్భంతో ఉన్న ఓ మహిళ మృతి చెందగా, ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. గర్భిణిని పూడిస్తే

కర్నూలులో అమానుషం, గర్భిణి మృతదేహాన్ని అడవుల్లో చెట్టుకి కట్టేశారు

Family Members Tie Pregnant Woman Dead Body To Tree In Kurnool District

ఆచారాలు, కట్టుబాట్ల పేరుతో కర్నూలు జిల్లాలో అమానుష ఘటన జరిగింది. గర్భంతో ఉన్న ఓ మహిళ మృతి చెందగా, ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. గర్భిణిని పూడిస్తే గ్రామానికి అరిష్టమని అడ్డుపడ్డారు. దీంతో మరో దారి లేక కుటుంబసభ్యులు మృతదేహాన్ని అడవుల్లోకి తీసుకెళ్లి ఓ చెట్టుకి కట్టేసి వచ్చారు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో ఈ ఘోరం జరిగింది.

అనారోగ్యంతో కాన్పు కాకుండానే గర్భిణి మరణం:
రుద్రవరం మండలం బి.నాగిరెడ్డిపల్లెకి చెందిన ధర్మేంద్ర, లావణ్య దంపతులు. ఏడాదిన్నర క్రితమే వీరికి పెళ్లి జరిగింది. నిండు గర్భిణి అయిన లావణ్యను కాన్పు శుక్రవారం(జూన్ 26,2020) రాత్రి నంద్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అనారోగ్య సమస్యలతో లావణ్య బిడ్డకు జన్మనివ్వకుండానే ప్రాణాలు వదిలింది. పిండాన్ని బయటకు తీయాలని బంధువులు డాక్టర్లను కోరారు. కరోనా భయంతో గర్భం నుంచి పిండాన్ని తీసేందుకు వైద్య సిబ్బంది నిరాకరించారు. దీంతో లావణ్య మృతదేహాన్ని స్వగ్రామం బి.నాగిరెడ్డిపల్లెకు తీసుకొచ్చారు బంధువులు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుపడ్డారు. గర్భంలో బిడ్డ ఉండగానే అంత్యక్రియలు చేస్తే గ్రామానికి అరిష్టమంటూ అంత్యక్రియలను ఆపేశారు. నిండు గర్భిణి మృతదేహాన్ని గ్రామంలో పూడ్చటం క్షేమం కాదని కొందరు పెద్దలు కూడా చెప్పారు.

గర్భిణి మృతదేహాన్ని అడవిలో చెట్టుకి కట్టేశారు:
దీంతో కుటుంబసభ్యులు ఆలోచనలో పడ్డారు. వారికి మరో దారి లేకపోయింది. గ్రామానికి సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతానికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ ఒక చెట్టుకి మృతదేహాన్ని తాళ్లతో కట్టేసి వెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత అంటే ఆదివారం(జూన్ 28,2020) అటుగా వెళ్తున్న ఇతర గ్రామాలకు చెందిన ప్రజలు ఆ మృతదేహాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలి బంధువులు, గ్రామస్తులతో పోలీసులు మాట్లాడారు. వెంటనే మృతదేహాన్ని పూడ్చి పెట్టాలని, లేకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసుల ఎంట్రీతో గ్రామస్తులు వెనక్కి తగ్గారు. దీంతో మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు బంధువులు సిద్ధమయ్యారు.

ఆధునిక కాలంలోనూ అనాగరిక చర్యలు:
అసలే నిండు గర్భిణి చనిపోవడంతో దుఖంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులను ఆచారాలు, కట్టుబాట్లు అంటూ గ్రామస్తుల సూటిపోటీ మాటలతో మరింతగా వేదనకు గురిచేశాయి. ఈ ఆధునిక కాలంలోనూ సభ్యసమాజం తలదించుకునేలా అనాగరిక చర్యలకు పాల్పడిన గ్రామస్తులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారులు ఆ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావాలని కోరుతున్నారు.

Read: పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేసింది ఆ ఇద్దరు యువతులే, గుంటూరు యువతి నగ్న వీడియోల కేసులో కొత్త కోణం