భూవివాదం నేపధ్యంలో ఏఎస్సైపై దాడి చేసిన రైతు

  • Published By: murthy ,Published On : December 14, 2020 / 03:00 PM IST
భూవివాదం నేపధ్యంలో ఏఎస్సైపై దాడి చేసిన రైతు

Farmer attacks ASI with knife : పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఏఎస్సై పై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. గ్రామంలో ఏర్పడిన భూవివాదాల నేపధ్యంలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్న ఏఎస్సైపై హత్యా యత్నం చేయటంతో ఆయన తలకు తీవ్రగాయమైంది.

జిల్లాలోని వీరవాసరం శివారు బొబ్బనపల్లి సమీపంలో ఓ భూ వివాదంలో గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీహెచ్ గోపి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శాంతి భద్రతల పర్యవేక్షించటానికి ఏఎస్సై పి.పార్థసారథి,కానిస్టేబుల్ మూర్తితో కలిసి గ్రామానికి వెళ్లారు. దీంతో భూ యజమానులైన ఆర్.ఏ.కుమార్, సీహెచ్.గోపీ, ఏఎస్సైల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ సమయంలో ఆర్.ఏ.కుమార్ రెచ్చిపోయి అక్కడ ఉన్న కత్తి తీసుకుని ఏఎస్సైపై దాడి చేశాడు. ఈ దాడిసో ఏఎస్సై తలకు హలంగా గాయం అయ్యింది. దీంతో ఆయన రక్తపు మడుగులో అక్కడే కుప్పకూలిపోయారు. అదే సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన గోపి ఎడమ చేతిపైన కూడా కుమార్ కత్తితో నరికాడు.

గాయపడిన వీరిద్దర్నీ స్థానికులు మొదట వీరవాసరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా దాడిలో తీవ్రంగా గాయపడిన ఏఎస్సైకి అధిక రక్తస్రావం కావటంతో ఒకానోక సమయంలో ఆరోగ్య పరిస్ధితి పై కొంత ఆందోళన నెలకొంది. సమాయానికి రక్తదాతలు సహకరించటంతో ఆయన పరిస్ధితి మెరుగుపడింది.

కాగా, ఏఎస్సై పార్థసారధిపై హత్యాయత్నం ఘటనపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తీవ్రంగా స్పందించారు. తక్షణమే సంఘటనా స్థలానికి వెళ్లి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక అందించాల్సిందిగా జిల్లా ఎస్పీని ఆదేశించారు. అలాగే ఏఎస్సైకి పూర్తి స్థాయిలో అత్యవసర వైద్యం అందించాలని ఎస్పీని ఆదేశించారు. ఈ ఘటనతో సంబంధమున్న వారందరినీ తక్షణమే అదుపులోకి తీసుకోని చేపట్టాలని డీజీపీ ఆదేశించారు.

సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ కే.నారాయణనాయక్ భీమవరం చేరుకుని చికిత్స పొందుతున్న పార్ధసారధిని పరామర్శించి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం పోలీసు స్టేషన్ కు చేరుకుని ఈ ఘటనతో సంబంధం ఉన్నవారిని గుర్తించి అరెస్ట్ చేయమని ఆదేశించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.