గుండెలు పిండే విషాదం.. నమ్ముకున్న వ్యవసాయమే కాటేసింది, అప్పుల బాధతో రైతు దంపతులు ఆత్మహత్య

ఇది గుండెలు పిండే విషాదం. కంట తడి పెట్టించే ఘటన. భూమిని నమ్ముకున్న రైతు దంపతులు తనువు చాలించారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. నెల రోజుల వ్యవధిలో భార్య, భర్త ఆత్మహత్య చేసుకోవడంతో వారి ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు.

గుండెలు పిండే విషాదం.. నమ్ముకున్న వ్యవసాయమే కాటేసింది, అప్పుల బాధతో రైతు దంపతులు ఆత్మహత్య

Farmer Couple Suicide In Kurnool District

farmer couple suicide in kurnool district: ఇది గుండెలు పిండే విషాదం. కంట తడి పెట్టించే ఘటన. భూమిని నమ్ముకున్న రైతు దంపతులు తనువు చాలించారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. నెల రోజుల వ్యవధిలో భార్య, భర్త ఆత్మహత్య చేసుకోవడంతో వారి చిన్నారులు అనాథలయ్యారు.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం పి.చింతకుంటలో ఈ విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయం కలిసిరాక అప్పులపాలయ్యారు. వాటిని తీర్చే మార్గం లేక చావే శరణ్యమని అనుకున్నారు. ఫిబ్రవరి 7న భార్య ఆత్మహత్య చేసుకోగా, గురువారం(మార్చి 11,2021) భర్త బలవన్మరణం పొందాడు.

గ్రామానికి చెందిన అంబటి సంజీవరెడ్డికి (30) వ్యవసాయమే జీవనాధారం. ఏడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శ్రావణితో వివాహమైంది. వారికి తేజస్విని (5), అశ్విని (3), సాయి తేజస్వి(4 నెలలు) సంతానం. భార్యాభర్తలిద్దరూ పొలాలను కౌలుకు తీసుకుని పంటలు వేసేవారు. నష్టాలు వస్తున్నా… ఏదో ఒకరోజు గట్టెక్కుతామనే ధీమాతో ఉండేవారు.

ఈ ఏడాది పత్తి వేశారు. అయితే వాతావరణం కలిసిరాకపోవడంతో పంట దిగుబడి రాలేదు. రెండేళ్లుగా ఇదే పరిస్థితి. మరోవైపు సాగు చేయడానికి తెచ్చిన అప్పులు రూ.11 లక్షలకు చేరాయి. వడ్డీలు సైతం చెల్లించలేని దుస్థితి వచ్చింది. ఏం చేయాలో దిక్కుతోచని దంపతులు ఆందోళనకు గురయ్యారు.

భర్త ఆవేదనను చూడలేని భార్య శ్రావణి ఫిబ్రవరి 7న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణంతో హతాశుడైన సంజీవరెడ్డి… లోకం తెలియని తన చిన్నారులను పట్టుకుని గుండెలవిసేలా రోదించారు. నాటి నుంచి తీవ్రంగా కుంగిపోయిన అతడు గురువారం(మార్చి 11,2021) ఉదయం మిద్దెపైకి వెళ్లి అక్కడ పురుగుల మందు తాగాడు. ఆ తర్వాత కిందికి వచ్చి తల్లి వెంకటలక్ష్మమ్మతో ‘అమ్మా అప్పులు ఎక్కువయ్యాయి, తీర్చే మార్గం లేదు. నమ్మిన వ్యవసాయమే కాటేసింది. నేను చచ్చిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త’ అంటూ కుప్పకూలాడు.

కన్నకొడుకు స్థితి చూసి తల్లడిల్లిన ఆ తల్లి వెంటనే అతడిని ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. 30 రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. బంధువులు, గుండెలవిసేలా రోదించారు. అయ్యో పాపం అని స్థానికులు సైతం కన్నీరు పెట్టారు.