Telugu States Rains : ఏకధాటిగా వర్షాలు..రైతన్నల కన్నీళ్లు

Telugu States Rains : ఏకధాటిగా వర్షాలు..రైతన్నల కన్నీళ్లు

Formers

Heavy Rains: కేరళలో వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు తాకడంతో తొలకరి జల్లులు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు మరో వారంపైగానే పడుతుంది. కానీ ఇంతలోనే వర్షాలు దంచికొట్టాయి. దీంతో ఏపీ, తెలంగాణలోని రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. అయితే వేసవి ఉక్కబోత నుంచి ప్రజలు కాస్త ఉపశమనం చెందారు.

అన్నదాతల కష్టాలు : –
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అన్నదాతను కష్టాలపాల్జేశాయి. మహబూబాబాద్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఒక్కసారిగా కురిసిన వర్షంతో…ధాన్యపు కొనుగోలు కేంద్రాల వద్ద ఉంచి ధాన్యం తడిచిపోయింది. మహబూబాబాద్‌లోని మార్కెట్‌లో కూరగాయలు కొట్టుకుపోయాయి. వాటిని పట్టుకునేందుకు వర్షంలోనే ఇక్కట్లు పడ్డారు రైతులు.

ఇళ్లలోకి వరదనీరు : –
మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలో వాన దంచికొట్టింది. రోజంతా ఏకధాటిగా కురిసిన వర్షానికి వాగులు, ఒర్రెలు పొంగి ప్రవహించాయి. మట్టెవాడ సమీపంలోని సౌడు ఒర్రెను బైక్‌పై వెటర్నరీ డాక్టర్ భాస్కర్‌ అదుపుతప్పారు. బైక్‌తో సహా కొంతదూరం కొట్టుకుపోయారు. ఒర్రె వద్ద ఉన్న కొందరు వ్యక్తులు వెటర్నరీ డాక్టర్‌ను కాపాడారు. బైక్‌ను వెలుపలికి తెచ్చారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహించాయి. నాంపల్లి మండలం రాందాస్ తండా వద్ద శేషి లేటి వాగు ఉధృతికి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. అటు చండూర్ వాగు లోతట్టుప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరింది.

రోడ్లన్నీ చెరువులు : –
చండూర్‌లో రెండు గంటల పాటు కురిసిన వర్షానికి.. ఐకేపీ సెంటర్ వద్ద ధాన్యం తడిచిపోయింది. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి తడిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు భారీ వర్షంతో సేదదీరారు. ఊరుములు, మెరుపులుతో కురిసిన భారీ వర్షానికి ఖమ్మంలో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అండర్ గ్రౌండ్ డ్రయినేజీ వ్యవస్థ లేకపోవటంతో వరద నీరంతా రోడ్ల పై చేరింది. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి.

పొంగి పొర్లిన వాగులు, వంకలు : –
దీంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో చిరువ్యాపారులు తడిచిపోయారు. పాల్వంచలో నల్లటి మేఘాలతో పగలే చీకటిని తలపించింది. ఒక్కసారిగా ఈదురుగాలులు మొదలై.. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో కురిసిన వర్షాలకు.. వాగులు వంకలు పొంగిపొర్లాయి. పలుచోట్ల భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

ఏపీలో విస్తారంగా వర్షాలు : –
అటు ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురిసాయి. కర్నూలు జిల్లా అవుకు ఎర్రమల కొండల్లో కుండపోతగా వాన పడింది. దీంతో ఎత్తిపోత, గొల్లలేరు జలపాతాలు జలకళ సంతరించుకున్నాయి. ఎర్రమల కొండలపై నుంచి సుమారు 300 అడుగుల లోతుకు వర్షపునీరు జాలువారుతోంది. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. భారీ వర్షపు నీటితో.. అవుకు రిజర్వాయర్‌ జలకళను సంతరించుకుంటోంది.

జలకళ : –
కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో భారీ వర్షానికి.. కాల్వలు నిండి ప్రవహిస్తున్నాయి. కాల్వల్లో ఉన్న చెత్త చెదారం నీటి ప్రవాహానికి అడ్డు పడి కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. కుండపోత వర్షంతో ప్రధాన రహదారులపై నీరు నిల్చిపోవడంతో.. వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. అబ్బిరెడ్డి పల్లె చెరువు తూములు నిండి జల కళను సంతరించుకుంటే.. గోసాని పల్లె – కొచ్చెర్వు మార్గ మధ్యంలో వాగు ఉప్పొంగి కొన్ని గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

పలు ప్రాంతాలకు వర్ష సూచన : –
ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన బుట్టాయిగూడెం, జీలుగుమల్లి, కొయ్యలగూడెంలో కుండపోతగా వర్షం పడింది. జంగారెడ్డిగూడెం పట్టణంలో డ్రెయినేజి వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపై వరదనీరు ప్రవహించింది. నైరుతి రుతు పవనాలు, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో 2021, జూన్ 04వ తేదీ శుక్రవారం, శనివారం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు వర్షసూచన చేసింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని, కొన్ని చోట్ల పిడుగులు పడతాయని హెచ్చరించింది.

Read More : COVID Drug : కరోనాపై పోరు, రిలయన్స్ సరికొత్త డ్రగ్