చనిపోయిన కొడుకు స్థానంలో గోల్డ్‌ మెడల్స్‌ తీసుకున్న తండ్రి

  • Published By: veegamteam ,Published On : March 2, 2020 / 08:20 AM IST
చనిపోయిన కొడుకు స్థానంలో గోల్డ్‌ మెడల్స్‌ తీసుకున్న తండ్రి

ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఐదు బంగారు పతకాలు… ఒక్కొక్కటి తన మెడలో పడే కొద్ది ఆ తండ్రి కంట నీరు ఆగలేదు. మెడల్స్‌ వచ్చాయని సంతోష పడాలో… కొడుకు లేడని బాధ పడాలో తెలియని పరిస్థితి ఆ తండ్రిది. గుండెలు పగిలేలా ఏడవాలనిపించినా… బాధను దిగమింగుకుని, గోల్డ్‌ మెడల్స్‌ పట్టుకుని బయటకొచ్చేశాడు. కొడుకు సాధించిన మెడల్స్‌ ఆ తండ్రి బాధను రెట్టింపు చేశాయి. ఇంట్లో గోడకు వేలాడుతన్న మెడల్స్‌ ప్రతిరోజూ ఆ తండ్రిని ఏడిపిస్తున్నాయి. ఈ హృదయాన్ని కదిలించే ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి:
తిరుపాల్, లక్షమ్మ దంపతులది మార్కాపురంలోని బాపూజీ కాలనీ. వీళ్లది నిరుపేద కుటుంబం. వీరికి ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇక తిరుపాల్‌ ఇంటింటికి తిరిగి పూలు అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. లక్ష్మమ్మ కూలి పనులకు వెళుతూ తిరుపాల్‌కు తోడుగా నిలిచేది. కాయ కష్టం చేసి ఆరుగురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. ఇక ఒక్కగానొక్క కొడుకైనా చెన్నకేశవులు…. తల్లిదండ్రుల కష్టం చూసి బాగా చదువుకున్నాడు. పేదల కష్టాలను కళ్లారా చూసినా అతడు… కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలనుకున్నాడు. దానికి తగ్గట్లుగానే కష్టపడి ఢిగ్రీ ఫస్ట్‌ క్లాస్‌లో పాస్ అయ్యాడు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీలో ఎం.ఏ పూర్తి చేశాడు. అక్కడే పొలిటికల్‌ సైన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్‌లో పీహెచ్‌డీలో చేరాడు. ఇక మరికొన్ని రోజుల్లో పీహెచ్‌డీ పూర్తి అవుతుంది అనుకున్న తరుణంలో విధి చిన్నచూపు చూసింది. చెన్నకేశవులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 

కొడుకు చనిపోయిన 3 నెలలకే తల్లి మృతి:
2019 ఆగస్టులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నకేశవులు మృతి చెందడం ఆ కుటుంబాన్ని కుంగదీసింది. బిడ్డ పోయాడనే బాధతో కుంగిపోయిన తల్లి మూడు నెలలకే కొడుకు దగ్గరికి వెళ్లిపోయింది. దీంతో తిరుపాల్‌కు అండ లేకుండా పోయింది. ఒంటరి జీవితం అయిపోయింది. ఇక ఆయన బాధ చెప్పడానికి మాటలు సరిపోవు. రాయడానికి పదాలు రావు. 

చెన్నకేశవులు ప్రతిభకు 5 మెడల్స్:
కొడుకు చెన్నకేశవులు పీజీ, పీహెచ్డీ పరీక్షల్లో చూపిన ఎనలేని ప్రతిభకు ఏకంగా ఐదు బంగారు పతకాలు వరించాయి. చెన్నకేశవులు లేకపోవడంతో అతని తరుపున ఆయన తండ్రి తిరుపాల్‌ బంగారు పతకాలను స్వీకరించాడు. ఆయన స్టేజీ మీదకు వచ్చిన తీరు చూస్తే… ఏ ఒక్కరికి కన్నీళ్లు ఆగలేదు. నిరుపేదగా పుట్టి ఉన్నత చదువుల్లో ప్రతిభ కనబరిచి… తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన చెన్నకేశవులు అందరికి కళ్ల ముందు కనిపించాడు. గుండెను బరువెక్కించి… ప్రతిఒక్కరి చేత కన్నీరు పెట్టించాడు. 

ఊరినే ఏడిపిస్తున్న చెన్నకేశవులు మరణం:
కొడుకు లేని లోటు ప్రతిరోజూ కుంగదీస్తుందంటున్నాడు తిరుపాల్‌. భార్య చనిపోవడంతో బాధ మరింత రెట్టింపు అయ్యిందన్నాడు. మరికొన్ని రోజుల్లో మంచి ఉద్యోగంలో చేరి… మా బతుకులు మారుస్తాడనుకుంటే అసలికే కనిపించకుండా పోయాడని కన్నీరు పెట్టుకున్నాడు. కొడుకు చనిపోవడం దిక్కులేని వాడిని చేసిందంటున్నాడు. మొత్తంగా… చెన్నకేశవులు మరణం ఊరినే ఏడిపిస్తోంది. అద్భుత ప్రతిభ, కష్టపడే మనస్తత్వం ఉన్న చెన్నకేశవులు మరణాన్ని ఊళ్లో జనం జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ మనిషిని కదిలించినా కన్నీరే సమాధానవుతోంది.