విజయవాడ కరోనా సెంటర్‌లో అగ్నిప్రమాద ఘటనలో ఏడుగురు మృతి

  • Published By: naveen ,Published On : August 9, 2020 / 08:27 AM IST
విజయవాడ కరోనా సెంటర్‌లో అగ్నిప్రమాద ఘటనలో ఏడుగురు మృతి

విజయవాడలో కరోనా సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రమేష్‌ ప్రైవేట్ ఆసుపత్రి కొవిడ్‌కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో ఆదివారం (ఆగస్టు 9,2200) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వేరే ఆసుపత్రులకు తరలించారు. కాగా, లోపల మరికొన్ని మృతదేహాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 15మంది కరోనా బాధితులను సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో పొగ దట్టంగా అలుముకుంది. రమేష్ ప్రైవేట్ ఆసుపత్రి స్వర్ణ ప్యాలెస్ ని అద్దెకు తీసుకుని కరోనా సెంటర్ గా వినియోగిస్తున్నారు.

ప్రమాద సమయంలో ప్యాలెస్ లో 40మంది:
ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమంచి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో ప్యాలెస్ లో మొత్తం 40మంది వరకు ఉన్నట్టు సమాచారం. వీరిలో 30మంది కొవిడ్‌ బాధితులు కాగా 10మంది ఆసుపత్రి సిబ్బంది. దట్టంగా అలుముకున్న పొగ వల్ల బాధితులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ కిటికీల్లోంచి కేకలు వేశారు. బాధితులను లబ్బీపేట, మెట్రోపాలిటన్‌ హోటల్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు తరలిస్తున్నారు. స్వర్ణ ప్యాలెస్‌ దగ్గర సహాయచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఒకటో అంతస్తు నుంచి దూకిన నలుగురు:
అగ్నిప్రమాదంతో పొగలు దట్టంగా వ్యాపించాయి. దీంతో భవనంలో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి అంతస్తుల్లో మంటలు అలముకున్నాయి. ఇతర అంతస్తులకు పొగలు వ్యాపించాయి. ఒకటో అంతస్తు నుంచి నలుగురు వ్యక్తులు కిందకి దూకేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కిటికీ అద్దాలను పగలగొట్టి నిచ్చెన సాయంతో పలువురిని కిందికి తీసుకువచ్చారు.

షార్ట్‌ సర్క్యూట్‌తోనే ప్రమాదం:
తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుందని.. షార్ట్‌సర్క్యూట్‌తోనే మంటలు చెలరేగినట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు. బాధితులను భవనంలోని మెట్ల మార్గం ద్వారా తీసుకురావడం కుదరలేదని చెప్పారు. దీంతో నిచ్చెనల ద్వారా బాధితులను కిందికి దించి ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు.

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం, మంత్రి వెల్లంపల్లి:
విషయం తెలిసిన వెంటనే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, బాధితులను ఆదుకుంటామని మంత్రి చెప్పారు. ప్రమాదానికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో ఘోరమైన అగ్నిప్రమాదం జరిగిందని విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఘటనపై ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి దర్యాఫ్తు చేస్తామన్నారు.