దీపావళి వేళ విషాదం : ఏపీలో అగ్ని ప్రమాదాలు, పూరిళ్లు దగ్ధం

  • Published By: madhu ,Published On : November 15, 2020 / 06:41 AM IST
దీపావళి వేళ విషాదం : ఏపీలో అగ్ని ప్రమాదాలు, పూరిళ్లు దగ్ధం

Fire Incident Diwali In Andhrapradesh State : వెలుగు జిలుగుల దీపావళి పలుచోట్ల విషాదాన్ని నింపింది. పేల్చిన టపాసుల నిప్పురవ్వలుపడి గుడిసెలు అగ్నికి అహుతయ్యాయి. దీపావళి వేళ విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా కాలుస్తుంటే నిప్పు రవ్వలు ఎగిసిపడి ఐదు పూరిళ్లు పూర్తిగా దగ్దమయ్యాయి.



విజయనగరం జిల్లా గుర్ మండలం తాటివారికిట్టిలిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీపావళి పండగ సందర్భంగా సాయంత్రం నుంచి ఈ గ్రామంలో బాణాసంచా కాల్చారు. ఉన్నట్టుండి నిప్పులు రవ్వలు ఎగిసిపడి పూరి గుడిసె మీద పడటంలో మంటలు రాజుకున్నాయి. ఆ తర్వాత ఒకదాని వెంట ఒకటిగా ఐదు ఇళ్లు మంటలకు ఆహుతయ్యాయి. మంటల్లో చిక్కుకుని పశువులు ఎక్కడివక్కడే మరణించాయి.



దీపావళి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పొందూరులో బాణాసంచా పేలి రెండు పూరిళ్లు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. రాత్రి 9 దాటిన తర్వాత బాణాసంచా కాలుస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.



కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో విషాదం చోటుచేసుకుంది.
బాణసంచా కాలుస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బీహార్‌కు చెందిన రాజేష్‌ కుమార్‌గా గుర్తించారు. వీరవల్లిలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న రాజేష్ కుమార్ బాణసంచా కాలుస్తూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ప్రమాద స్థలాన్ని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు.



కృష్ణా జిల్లా గన్నవరంలోని గౌడపేటలో అగ్ని ప్రమాదం జరిగింది. దీపావళికి కాల్చిన బాణాసంచా నిప్పురవ్వలు పడి ఓ పూరిల్లుకు మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో గుడిసె పూర్తిగా దగ్దమైంది. ఇంట్లోని వస్తులన్నీ ఆగ్నికి ఆహుతయ్యాయి. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.



తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన దీపావళి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పెద్దాపురం బంగారం గుడివీధిలో తారాజువ్వలుపడి ఓ పూరిల్లు దగ్దమైంది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసేసింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టుగా తెలుస్తోంది.



ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల కేంద్రంలోని కంభం వాల్మీకి నగర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. దీపావళి రాకెట్‌ నిప్పురవ్వలు పూరి గుడిసెపై పడ్డాయి. దీంతో గుడిసెకు నిప్పు అంటుకుంది. క్షణాల్లోనే మంటలు భారీగా ఎగసిపడడంతో.. గుడిసె అగ్నికి ఆహుతైంది. ఇంట్లోని వస్తువులు, సామాగ్రి పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. దీంతో ఆ ఇంట్లోని వారు రోడ్డునపడ్డారు. రెండు లక్షల ఆస్తినష్టం జరిగిందని.. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.



నెల్లూరు ట్రంకురోడ్డులోని బేబీ టాయ్స్‌ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. షోరూం మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా చెలరేగడంతో.. షోరూమ్‌లోని వస్తువలన్నీ కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది రెండు గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.