ఏపీలో కరోనా కల్లోలం, కర్నూలులో తొలి పాజిటివ్ కేసు

  • Published By: veegamteam ,Published On : March 28, 2020 / 01:42 PM IST
ఏపీలో కరోనా కల్లోలం, కర్నూలులో తొలి పాజిటివ్ కేసు

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం రేపుతోంది. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా శనివారం(మార్చి 28,2020) మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 17కి పెరిగింది. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. సంజామల మండలం నొస్సంలో రాజస్తాన్ కు చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ గా రిపోర్టుల్లో వచ్చింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. నొస్సం గ్రామానికి 3 కిమీ చుట్టూ కరోనా జోన్, 7 కిమీ వరకు కరోనా బఫర్ జోన్ గా కలెక్టర్ వీర పాండియన్ ప్రకటించారు. ప్రకాశం జిల్లాకు చెందిన దంపతులకు కరోనా సోకింది. ఒంగోలు రిమ్స్ ఐసోలేషన్ వార్డులో వారికి చికిత్స అందిస్తున్నారు. దంపతుల కొడుకు, కోడలు, మనవరాలిని సైతం రిమ్స్ లోని క్వారంటైన్ కు తరలించారు. కరోనా కేసుల సంఖ్య పెరుగతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

13 కేసుల్లో 12 కరోనా కేసులు పట్టణాల్లోనే:
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి సీఎంతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో చర్చించినట్టు ఏపీ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి సాయం చేయాలని కోరినట్టు తెలిపారు. అక్కడి కూలీలు, కార్మికుల కోసం ప్రత్యేక అధికారిని నియమించినట్టు తెలిపారు. దీనిపై ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడామన్నారు.  ఏపీలో మొత్తం 13 కేసుల్లో 12 కేసులు కేవలం పట్టణాల్లోనే బయటపడ్డాయని చెప్పారు. కరోనా నివారణకు పట్టణాలు, నగరాల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి 10 మందికి ఒక డాక్టర్ ని, నిపుణుడిని అందుబాటులో ఉంచామన్నారు. విదేశాల నుంచి వచ్చినవారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు.

తెలంగాణలో తొలి కరోనా మరణం, 65కి పెరిగిన కేసులు:
తెలంగాణలోనూ కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 65కి పెరిగింది. అంతేకాదు రాష్ట్రంలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. కరోనాతో 74ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. మృతుడు ఇటీవలే ఢిల్లీలోని ఓ మసీదులో ప్రార్థన చేసినట్టుగా తమకు సమాచారం ఉందని శనివారం (మార్చి 28, 2020) రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.

పాతబస్తీలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా:
హైదరాబాద్ లోని పాతబస్తీలో ఒకే కుటుంబానికి చెందినవారికి కరోనా పాజిటివ్ వచ్చిందని మంత్రి తెలిపారు. వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు తెలిపారు. తెలంగాణలో కరోనా కట్టడికి చర్యలు చేపట్టినట్టు చెప్పారు. కుత్బుల్లాపూర్ లో ఒకరికి పాజిటివ్ వచ్చిందన్నారు. ఇవాళ(మార్చి 28,2020) ఒక్క రోజే ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపారు.

ఢిల్లీలో మసీదులో ప్రార్థనలో పాల్గొన్న వృద్ధుడు:
ఢిల్లీ నుంచి వచ్చిన వృద్ధుడు అనారోగ్యంతో గ్లోబల్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ పాతబస్తీకి చెందిన వృద్ధుడు మృతిచెందినట్టు ఈటల వెల్లడించారు. వైద్య పరీక్షలు చేయగా కరోనా సోకినట్టు తేలిందన్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వ్యక్తి వల్ల చాలామందికి కరోనా పాజిటివ్ వచ్చిందని మంత్రి చెప్పారు. 10మందికి పైగా కరోనా బాధితులు కోలుకున్నారని ఈటల స్పష్టం చేశారు. మరో 10 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందన్నారు. 

కరోనాతో 74ఏళ్ల వృద్ధుడు మృతి:
కుత్బుల్లాపూర్ కి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందినట్టు తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం వెల్లడించారు. బాధితుడికి సైఫాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలై గురువారం(మార్చి 26,2020) రాత్రి ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. మార్చి 14న మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన వృద్ధుడు మార్చి 17న తిరిగి వచ్చాడు. 20న తీవ్ర జ్వరం వచ్చింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో అతడికి సైఫాబాద్ లోని ఓ ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చికిత్స చేయించారని మంత్రి వివరించారు. గురువారం రాత్రి అతడు ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి నమూనాలు సేకరించి ల్యాబ్ కి పంపగా, కరోనా సోకినట్టు తేలింది. వృద్ధుడి భార్య, కొడుకిని అధికారులు హోం క్వారంటైన్ లో ఉంచారు. క్వారంటైన్ లో ఉన్నవారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోందన్న మంత్రి, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.