ప్రకాశం జిల్లా మత్స్యకారులతో ప్రభుత్వం నేడు చర్చలు

ప్రకాశం జిల్లా మత్స్యకారులతో ప్రభుత్వం నేడు చర్చలు

Fishermen Fight, Government talks with fishermen on prakasam district : ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో మత్స్యకారుల మధ్య నెలకొన్న వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగుతోంది. ఇవాళ ఇరువర్గాలకు చెందిన మత్స్యకారులతో మంత్రి సీదిరి అప్పలరాజు చర్చలు జరుపనున్నారు. మరి ఇవాళ జరిగే చర్చలతోనైనా సమస్యకు పరిష్కారం లభిస్తుందా…. మత్స్యాకారుల మధ్య ఏర్పడిన వివాదం సద్దుమణుగుతుందా అనేది వేచి చూడాలి. బల్లవల, ఐలవల మత్స్యకారుల మధ్య సాగుతున్న కురుక్షేత్ర యుద్ధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు సర్కార్‌ రంగంలోకి దిగింది. ఇవాళ మరోసారి మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేసింది.

జిల్లా కలెక్టర్‌, మత్స్యశాఖ అధికారులతోపాటు.. మంత్రి సీదిరి అప్పలరాజు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇరువర్గాలకు చెందిన మత్స్యకారులతో సమస్య పరిష్కారం కోసం చర్చలు జరుపుతారు. మత్స్యకారుల మధ్య నెలకొన్న వివాదం అత్యంత సున్నితమైనది ప్రభుత్వం భావిస్తోంది. సమస్య పరిష్కారానికి కొన్ని మార్గాలను ఇప్పటికే సిద్ధం చేసిన సర్కార్‌… వాటిని ఆచరణలో పెట్టాలని భావిస్తోంది.

సోమవారం జనవరి 4వ తేదీన, ఒంగోలు కలెక్టరేట్‌లోని స్పందన బిల్డింగ్‌లో మత్స్యకారశాఖ మంత్రి అప్పలరాజు ఆధ్వర్యంలో చర్చలు జరుపనుంది. మధ్యాహ్నం 2గంటలకు ఈ సమావేశం మొదలుకానుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు.. ఇప్పటికే ఇరువర్గాల మత్స్యకారులకు నోటీసుల రూపంలో తెలియజేశారు. ఒక్కో వర్గం నుంచి కేవలం 5 మంది మత్స్యకారులను మాత్రమే సమావేశానికి ఆహ్వానించారు. అయితే మత్స్యకారులు మాత్రం కనీసం 25 మందికైనా అనుమతించాలని కోరుతున్నారు.

మత్య్సకార గ్రామాల మద్య ప్రస్తుతం పరిస్థితి కొంత శాంతియుతంగానే ఉన్నా…సముద్రంలో వేటపై మాత్రం నిషేధం కొనసాగుతోంది. దీంతో బోట్లు సముద్రంలో లంగర్లకే పరిమితమయ్యాయి. కఠారీపాలెంలో సైతం తీర ప్రాంత ఒడ్డుకే పడవలు పరిమితం కావడంతో వేటలేక మత్స్యకారుల జీవనం దుర్బరంగా మారింది. అదే సమయంలో ఇప్పటికే జిల్లా అధికారులు ఇరువర్గాలు ఆక్షేపిస్తున్న బల్లవల, ఐలవల రెండింటిపై నిషేదం విధించగా ఆ నిర్ణయాన్ని బల్లవల మత్య్స కారులు స్వాగతిస్తున్నారు.

ఇరువర్గాల మద్య విభేదాలు లేకుండా అన్నదమ్ముల్లా మెలిగేలా సముచితమైన శాశ్వత పరిస్కారాన్ని అధికారులతోపాటు మంత్రి అప్పల రాజు నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. వాడరేవు పై జరిగిన ఘర్షణలతో తీవ్రంగా నష్టపోయిన తమకు పరిహారం చెల్లించే విషయంలో మంత్రి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

మరోవైపు ఐలవల మత్య్సకారులు మాత్రం అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా విభేదిస్తున్నారు. అసలు సమస్య బల్లవలేనని చెబుతున్నారు. ఐల వలను నిషేధించడాన్ని తాము అంగీకరించ బోమని చెబుతున్నారు. ఇవాళ జరిగే చర్చల్లో ఇరువర్గాలకు అనుకూలమైన పరిష్కారం ప్రభుత్వం చూపాలని కోరుతున్నారు. ఇరువర్గాల మత్స్యకారులు తమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. మరి ఇవాళ జరిగే సమావేశంలోనైనా మత్స్యకారుల మధ్య నెలకొన్న వివాదానికి పరిష్కారం లభిస్తుందో… లేదో… మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.