కుప్పంలో విషాదం : బట్టలు ఉతికేందుకు చెరువులోకి దిగి నలుగురు మృతి

కుప్పంలో విషాదం : బట్టలు ఉతికేందుకు చెరువులోకి దిగి నలుగురు మృతి

Four died after falling into a pond : చిత్తూరు జిల్లాలోని కుప్పంలో విషాదం చోటు చేసుకుంది. దుస్తులు ఉతికేందుకు చింపనగల్లు చెరువులోకి దిగిన నలుగురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మొదట చెరువులో ఇద్దరు చిన్నారులు పడిపోవడంతో.. వారిని కాపాడేందుకు ఇద్దరు మహిళలు చెరువులోకి వెళ్లారు. ఇది గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నలుగురి మృతదేహాలను వెలికి తీశారు.

32 ఏళ్ల రుక్మిణీ తన ఇద్దరు కీర్తి, హారతితోపాటు తన మరదలు గౌరమ్మ వెంటపెట్టుకుని బట్టలు ఉతికేందుకు చింపనగల్లు చెరువుదగ్గరకు వెళ్లింది. అయితే ఇద్దరు మహిళలు బట్టలు ఉతుకుతుండగా చిన్నపాప కీర్తి చెరువులో పడిపోయింది. ఈ విషయాన్ని చూసిన తల్లి రుక్మిణీ
కీర్తిని కాపాడే ప్రయత్నం చేసింది. రుక్మిణీతోపాటు మరో చిన్నారి హారతి కూడా చెరువులో పడిపోయారు.

ఇది చూసిన గౌరమ్మ అనే మహిళ వారిని కాపాడేందుకు చెరువులో దూకేసింది. చివరకు చెరువులో మునిగి ఊపిరాడక ఇద్దరు చిన్నారులతోపాటు మరో ఇద్దరు మహిళలు కూడా మృతి చెందారు. నలుగురు మృతదేహాలను బయటికి తీశారు. వీరి మృతితో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. చిన్నపాపను కాపాడే ప్రయత్నంలో నలుగురు మరణించడం అందరినీ కలిచి వేస్తోంది.