వైసీపీ నుంచి రాజ్యసభకు ఆ నలుగురు! ఆ లిస్ట్‌లో మెగాస్టారు!

10TV Telugu News

రాజ్యసభ ఎంపీల స్థానాల కోసం నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే హడావుడి మొదలైంది. శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడంతో.. ఇప్పటివరకు ఎమ్మెల్సీ పదవి వస్తే చాలని భావించిన వాళ్లు సైతం రాజ్యసభ సీటు కోసం లాబీయింగ్ మొదలుపెట్టారనే టాక్‌ నడుస్తోంది. ఏప్రిల్‌లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార పార్టీలో పోటీ ఎక్కువైంది. ఎలాగైనా ఓ సీటు పట్టేద్దామని ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏపీలో అధికార వైసీపీకి నాలుగు సీట్లు దక్కనున్నాయి. పదవులు ఆశిస్తున్న వారంతా పెద్దల సభపై కన్నువేశారంటున్నారు. కాకపోతే ఇప్పటికే వైసీపీలో ఒక లిస్ట్‌ తయారైపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

చంద్రబోస్ మినహా : 
మండలి రద్దు ఆలోచనల నేపథ్యంలో ఎమ్మెల్సీలుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబాబోస్ రాజ్యసభ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. వారిద్దరూ ఈ రేస్‌లో ముందు వరసలో ఉన్నారనే ప్రచారం సాగుతుండగా.. మరో ఇద్దరు వ్యాపారవేత్తలు పెద్దల సభ కోసం తీవ్రంగా అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పుడు వైసీపీ తరఫున నలుగురికి రాజ్యసభ సీట్లు గ్యారెంటీ అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాతవారి పేర్లలో ఒక్క సుభాష్‌ చంద్రబోస్‌ మినహా మిగిలిన వారి పేర్లు పక్కకు పోయాయి. కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. 

షర్మిలకు రాజ్యసభ ఛాన్స్ :
ఈసారి సీఎం జగన్ సోదరి షర్మిలకు రాజ్యసభలో కూర్చొనే అవకాశం ఇస్తారట. అలానే మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, జస్టిస్ చలమేశ్వర్, మెగాస్టార్ చిరంజీవి పేర్లతో లిస్ట్‌ రెడీ అయ్యిందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలను తన భుజాలపై వేసుకుని, ఓదార్పు యాత్ర కొనసాగించారు షర్మిల. పార్టీలో నిస్సత్తువ ఆవహించకుండా చూసుకున్నారు. కార్యకర్తలకు అండగా నిలబడ్డారు. జగనన్న వస్తున్నాడనే ధైర్యాన్ని పార్టీలో, ప్రజల్లో నూరిపోశారు. దీంతో షర్మిలను రాజ్యసభకు పంపి, గౌరవించాలనే ఆలోచనలో జగన్‌ ఉన్నారట. 

పవన్ దూకుడుకు జగన్ స్కెచ్ :
మరోపక్క, తన కేబినెట్ మంత్రి అయిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను కూడా పెద్దల సభకు పంపే ప్లాన్ ఉందట. శాసనమండలి రద్దైతే ఆయన మంత్రి పదవి పోతుంది. అందుకే రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకున్నారట. అన్నింటి కంటే విశేషం ఏంటంటే.. తెర మీదకు మెగాస్టార్‌ చిరంజీవి పేరు వచ్చింది. అనూహ్యంగా ఆయన కూడా ఈ రేస్‌లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. సైరా మూవీ రిలీజ్ తర్వాత జగన్‌ను ప్రత్యేకంగా కలిసిన ఆయన.. రాజధానులపై సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదనను సమర్థిస్తూ ప్రకటన కూడా విడుదల చేశారు.

ప్రభుత్వ నిర్ణయాలకు సమర్థిస్తూ వస్తున్న మెగాస్టార్‌కు చాన్స్‌ ఇవ్వాలనుకుంటున్నారట. దీనివల్ల జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దూకుడు అడ్డుకట్ట వేయొచ్చని జగన్‌ స్కెచ్‌ వేశారంటున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు చాన్స్‌ ఎవరికొస్తుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

10TV Telugu News