మన ‘పద్మా’లు

మన ‘పద్మా’లు

Four Padma Shri awards for AP and Telangana states : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పద్మాలు విరిశాయి. దేశ అత్యున్నత పురస్కారాలు తెలుగు వారిని వరించాయి. కేంద్రం ప్రకటించిన 102 పద్మశ్రీ అవార్డుల్లో.. నాలుగింటిని ఏపీ, తెలంగాణకు చెందిన కళాకారులు అందుకోనున్నారు. మరి ఎవరా తెలుగు తేజాలు..? వివిధ రంగాల్లో విశేష సేవలకు గుర్తింపుగా.. పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. మొత్తం 119 మందికి 2021 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. అందులో 102 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారం వరించింది. ఏపీకి చెందిన ముగ్గురు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒకరికి కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

ఏపీకి చెందిన ప్రముఖ కర్నాటక వయొలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామిని పద్మశ్రీ అవార్డు వరించింది. కేంద్ర ప్రకటించిన పద్మఅవార్డుల్లో ఆయన పద్మశ్రీకి ఎంపికయ్యారు. అన్నవరపు రామస్వామికి పద్మశ్రీ కళారంగం తరపున ఈ అవార్డు దక్కింది. రామస్వామి పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామానికి చెందిన వారు. ఇక అదే కళా రంగానికి చెందిన.. నిడుమోలు సుమతికి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది కేంద్రం. కళారంగంలో మృదంగ కళాకారిణిగా విశేష సేవలందిస్తున్న సుమతీ మోహనరావును పద్మశ్రీతో కేంద్రం సత్కరించింది.

అనంతపురం జిల్లాకు చెందిన అవధాని డాక్టర్‌ ఆశావాది ప్రకాశ్‌రావును పద్మశ్రీ అవార్డు వరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఆయన పద్మశ్రీకి ఎంపికయ్యారు. దీంతో ఆయన కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. ఆశావాది ప్రకాశరావు.. ప్రముఖ అవధాని. అంతేకాదు.. సీనియర్‌ సాహితీవేత్తకూడా. గతంలో ప్రిన్సిపాల్‌గానూ పనిచేశారు. తెలుగు సాహిత్యానికి ఆయన ఎనలేని సేవలు అందించారీయన.

తెలంగాణకు చెందిన ప్రముఖ గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు పద్మశ్రీ అవార్డు దక్కింది. మార్లవాయి గ్రామానికి చెందిన కనక రాజు 1940లో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచి గుస్సాడీ నృత్యంపై మమకారం పెంచుకొని ఆ కళారూపం అంతరించి పోకుండా కాపాడడంలో కీలక పాత్ర పోషించారు. గుస్సాడీ రాజుగా సుపరిచితుడైన కనక రాజుకు థీంసా నృత్యంలోనూ ప్రావీణ్యం ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డులు తెలుగు వారికి దక్కడంతో.. ఏపీ, తెలంగాణలో హర్షం వ్యక్తమవుతోంది.