క్రికెట్ మ్యాచ్‌లో వివాదం.. కత్తులు, కర్రలతో పరస్పరం దాడులు, నలుగురికి తీవ్రగాయాలు

  • Published By: naveen ,Published On : September 19, 2020 / 12:11 PM IST
క్రికెట్ మ్యాచ్‌లో వివాదం.. కత్తులు, కర్రలతో పరస్పరం దాడులు, నలుగురికి తీవ్రగాయాలు

సరదాగా ఆడే ఆట క్రికెట్. అయితే ఒక్కోసారి ఆ ఆట వివాదాలకు దారితీస్తోంది. యువకుల మధ్య చిచ్చుకు కారణం అవుతోంది. ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీస్తోంది. వివాదం ఎంతవరకు వెళ్తోంది అంటే.. కత్తులతో పొడుచుకునే వరకు, ప్రాణాలు తీసుకునే వరకు.

చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం దిన్నెవడ్డిపల్లెలో అలాంటి ఘటనే జరిగింది. గ్రామానికి చెందిన కొందరు యువకులు గురువారం క్రికెట్‌ ఆడారు. ఆ సమయంలో నాగసిద్ధులు (45) కుమారుడు నాగార్జున, నాగసుబ్బయ్య (34) బావమరిది నరేష్‌ మధ్య గొడవ జరిగింది.

ఇదే విషయంపై శుక్రవారం సాయంత్రం నాగసిద్ధులు, ఆయన కుమారులు వెంకటష్, నాగార్జున, బావమరిది యల్లయ్య, తమ్ముడు చంద్ర (43), తమ్ముని కుమారులు శ్రీనివాసులు, గిరిబాబు వర్గం, నాగసుబ్బయ్య, అతని తమ్ముడు నాగేంద్ర (32), బావమరది నరేష్‌ వర్గం పరస్పరం కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నారు.

ఈ ఘర్షణలో నాగసిద్ధులు కడుపు, చేతిపై కత్తిపోట్లు పడి తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే నాగసుబ్బయ్య తలకు తీవ్రగాయమైంది. నాగేంద్ర, చంద్ర సైతం తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ నలుగురినీ 108లో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్‌ చేశారు. పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో ఇరువర్గాలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సరదాగా ఆడిన క్రికెట్, ఇంత అనర్థానికి దారి తీస్తుందని ఎవరూ ఊహించ లేదు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.