Lemon Crop : కరోనా ఎఫెక్ట్..  100 కిలోలకు రూ.12వేలు, ఆనందంలో నిమ్మ రైతులు

చాలాకాలంగా సరైన ధర లభించక నిమ్మ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఖర్చులు కూడా రాని పరిస్థితులున్నాయి. ఈ ఏడాది మాత్రం నిమ్మపంటకు మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో నిమ్మ రైతులు ఆనందంలో ఉన్నారు.

Lemon Crop : కరోనా ఎఫెక్ట్..  100 కిలోలకు రూ.12వేలు, ఆనందంలో నిమ్మ రైతులు

Lemon Crop

Lemon Crop : చాలాకాలంగా సరైన ధర లభించక నిమ్మ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఖర్చులు కూడా రాని పరిస్థితులున్నాయి. ఈ ఏడాది మాత్రం నిమ్మపంటకు మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో నిమ్మ రైతులు ఆనందంలో ఉన్నారు. దిగుబడులు కాస్త తగ్గినా ధర ఆశాజనకంగా ఉండటంతో ఊరట చెందుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల, నల్లజర్ల, దేవరపల్లి, కామవరపు కోట, జంగారెడ్డిగూడెం, టి.నరసాపురం, చింతలపూడి, పెదవేగి, గోపాలపురం మండలాలతోపాటు డెల్టాలోని పాలకొల్లు, పోడూరు పరిసర ప్రాంతాల్లో 8 వేల హెక్టార్లలో నిమ్మ సాగు చేస్తున్నారు. గతేడాది(2020) నవంబర్ లో పంట పూత దశలో ఉన్న సమయంలో వర్షాలు పడటంతో ఆ ప్రభావం దిగుబడులపై పడింది. అయితే మంచి ధర లభిస్తుండటంతో నష్టాల నుంచి గట్టెక్కుతామనే ఆశతో రైతులు ఉన్నారు.

జిల్లాలో పండిన నిమ్మ కాయలను పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఈ ఏడాది(2021) ఉష్ణతాపం అధికంగా ఉండటంతో పాటు కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ‘సి’ విటమిన్‌ కలిగిన నిమ్మకు గిరాకీ ఏర్పడింది. 5 లక్షల టన్నుల వరకు ఎగుమతి కానున్నట్లు అధికారులు చెబుతున్నారు.

గతేడాది దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా లాక్‌డౌన్‌ నేపథ్యంలో సరైన ఎగుమతులు లేక ధర పతనమై రైతులు నష్టాలు చవిచూశారు. అప్పట్లో క్వింటాకు రూ.5వేల ధర రావడం కష్టమైంది. పెట్టుబడులు కూడా దక్కలేదు. నాణ్యమైన నిమ్మకాయలకు ఈ ఏడాది క్వింటాకు గరిష్ఠంగా రూ.12 వేల వరకు లభిస్తోంది. సగటున రూ.8 వేల నుంచి రూ.9 వేల వరకు ఇస్తున్నారు.