snake poison : నాగు పాము విషానికి భారీగా డిమాండ్…లీటర్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

నాగు పాముల విషానికి భారీగా డిమాండ్ ఉంది. విదేశాల్లోనూ ఎక్కువగా డిమాండ్ ఉంది.

10TV Telugu News

snake poison : మనుషుల ప్రాణాలు తీసే పాము విషం ప్రాణాల్ని కాపాడానికి కూడా ఉపయోగపడుతుందంటే అతిశయోక్తికాదు. గుండె సంబంధిత వ్యాధులు, రక్త పోటు వంటి రోగాలకు ఉపయోగించే కొన్ని రకాల ఔషధాల్లోనూ పాము విషాన్ని వినియోగిస్తారని తెలుస్తోంది. విషానికి విరుగుడుగా వైద్యులు అందించే ఇంజెక్షన్ మందును సైతం స్వల్ప శాతం విషం ఉపయోగించే తయారు చేస్తారని సమాచారం. నాగు పాముల విషానికి భారీగా డిమాండ్ ఉంది. విదేశాల్లోనూ ఎక్కువగా డిమాండ్ ఉంది.

నాగు పాముల విషం తులం ధర రూ.4 వేలు పలుకుతోందట. తులం పాము విషాన్ని దళారులు రూ.40 వేలకు అమ్ముతారని తెలుస్తోంది. దేశీయ మార్కెట్ లో లీటర్ నాగు పాముల విషం ధర రూ.40 లక్షలు పలుకుతుందట. అంతర్జాతీయంగా ఆ ధర కోటి రూపాయల పైగానే ఉంటుంది. అంత విలువ కలిగిన విషాన్ని ప్రాణాలొడ్డి పాముల నుంచి కక్కించే పాములోళ్లు మాత్రం పేదరికంలోనే మగ్గుతున్నారు. కూటికి లేని నిరుపేదలుగానే ఉండిపోతున్నారు. వెల్దుర్తి వద్ద నాగు పాముల్ని ఒడిసి పట్టి వాటి విషం సేకరించే పాములోళ్ల జీవితాలను అధ్యయనం చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కట్ల పాము, రాచ నాగు, కట్ల పింజర వంటి అనేక రకమైన విషం కలిగిన సర్పాలున్నా పాములోళ్లు నాగు పాముల్ని మాత్రమే పట్టుకుంటారు. ఇందుకు కారణం రాష్ట్రంలో నాగు పాములు విరివిగా దొరకడం. సరీసృపాల జాతికి చెందిన ఆడ నాగులు 12 నుంచి 30 వరకు గుడ్లు పెట్టి, రెండు నెలలపాటు పొదుగుతాయి. అప్పుడే పుట్టిన పిల్ల పాముకు సైతం పూర్తిస్థాయిలో పని చేసే విషపు గ్రంథులుంటాయి. ఏ వయసు నాగు పామును పట్టినా విషం తీసే అవకాశం ఉంటుంది.

నాగు పాము చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఇతర పాముల కంటే భిన్నంగా నాగు పాము పడగ విప్పుతుంది. వీటి పడగ వెనుక వివిధ రంగుల్లో కృష్ణపాదాలు ఆకర్షణీయంగా ఉంటాయి. పాములోళ్లు ఊదే నాద స్వరానికి అనుగుణంగా నాగు పాములు పడగ విప్పి ఆట ఆడుతుంటాయి. నాగు పాము విషం సేకరణకు, ప్రదర్శనలతో డబ్బు సంపాదించేందుకు ఉపయోగపడుతుంది. అందువల్ల పాములోళ్లు నాగు పాములను మాత్రమే పడతుండటం గమనార్హం.

పాములోళ్లు 10 నాగు పాముల తలల నుంచి తులం విషం తీస్తారు. పాము తల పైభాగం, కింది భాగాన్ని చేతులతో గట్టిగా నొక్కుతూ విషపు గ్రంథులను అదమడంతో కోరల్లోంచి విషాన్ని కక్కిస్తారు. ఆ విధంగా సేకరించిన విషాన్ని తులం రూ.4 వేలకు దళారులకు అమ్ముకుంటారు. అలా సేకరించిన విషాన్ని దళారులు పది రెట్లు అధిక ధరకు అమ్ముకుంటారు. పాములోళ్లు సేకరించిన విషాన్ని రబ్బరు మూత గల చిన్న గాజు సీసాలో భద్రపరుస్తారు. దళారులు నాణ్యత చూసి విషాన్ని కొనుగోలు చేస్తారు. దళారులు కోడిని తెచ్చి దానికి చిన్నపాటి గాయం చేస్తారట. పాములోళ్లు సేకరించిన విషాన్ని పిన్నీసు మొనతో గాయమైన కోడికి పూస్తారు. అది అరగంటలో మరణిస్తే నాణ్యమైనదిగా గుర్తిస్తారు. లేదంటే ఆ విషాన్ని కొనరని తెలుస్తోంది.

తమది ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతమని, నంద్యాల బొమ్మల సత్రంలో పదుల కుటుంబాలతో కలిసి ఉంటున్నామని పాములు పట్టే వ్యక్తి హనుమంతు పేర్కొన్నారు. ఎరుకల జాతికి చెందిన తమకు తాతల కాలం నుంచి నాగు పాములు పట్టడం, వాటి నుంచి విషం తీసి అమ్ముతామని చెప్పారు. మా నాన్న బళ్లారి ప్రాంతంలో పాము కాటుతోనే మృతి చెందారని తెలిపారు. ఆ సమయంలో ఆయన దగ్గర నాగమల్లి వేరు లేకపోవడమే కారణం. నాగమల్లి, వేరు, పాము తల నుంచి సేకరించిన రాయి లేకపోతే తాము కూడా పాములను పట్టలేమని, అవే తమ ధైర్యమని స్పష్టం చేశారు. పాము కాటుకు గురైన వాళ్లు తమ వద్దకు వస్తే నాగమల్లి వేరుతో నయం చేస్తుంటామని తెలిపారు.

10TV Telugu News