బెజవాడలో Gang war : పట్టపగలే కొట్టుకున్నారు..ఒకరి మృతి..ఏం జరిగింది

  • Published By: madhu ,Published On : June 1, 2020 / 01:18 AM IST
బెజవాడలో Gang war : పట్టపగలే కొట్టుకున్నారు..ఒకరి మృతి..ఏం జరిగింది

విజయవాడలో మళ్లీ గ్యాంగ్‌వార్‌ మొదలైందా? గ్రూపుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయా? బెజవాడ హిస్టరీ మళ్లీ రిపీట్‌ అవుతుందా?… రౌడీ గ్రూపుల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారా? అంటే… అవుననే అంటున్నాయి జరుగుతున్న పరిణామాలు. విజయవాడలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు చనిపోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. రౌడీ గ్యాంగ్‌లో రెచ్చిపోతుండడంతో బెజవాడ ఉలిక్కిపడుతోంది. రెండు గ్రూపులు కొట్లాటకు దిగాయి. యువకులు రాడ్లు, కర్రలతో కొట్టుకున్నారు. రాళ్లతో రువ్వుకున్నారు. కత్తులు దూసుకున్నారు. పట్టపగలు… ఇళ్ల మధ్యలో.. అందరూ చూస్తుండగానే… దాదాపు నలభై మంది కొట్టుకున్నారు. ఆరగంట పాటు యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు.

ఈ గొడవలో పాల్గొన్న యువకులంతా చదువుకునే వారే. వీరికి పెద్దన్న, చిన్నన్న అని ఇద్దరు ఉన్నారు. ఇందులో ఒకరు తోట సందీప్.. మరొకరు మణికంఠ అలియాస్‌… పండు. సందీప్‌ తాడిగడపలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాడు. ఇక పండేమో  విజయవాడ సనత్‌నగర్‌లో చికెన్ వ్యాపారం చేస్తాడు. ఈ ఇద్దరు కొంతకాలం క్రితం విజయవాడలోని ఓ ప్రజాప్రతినిధి వద్ద ప్రధాన అనుచరులుగా పని  చేశారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇద్దరూ ఇద్దరు ప్రజాప్రతినిధుల దగ్గర పని చేస్తున్నారు.

రియల్ ఎస్టేట్‌లో ఉన్న సందీప్.. చిన్న చిన్న సెటిల్‌మెంట్స్‌ చేస్తున్నాడు. అయితే పండు.. ప్రతిసారీ సందీప్ దందాకు అడ్డు పడుతున్నాడు. విజయవాడ శివారు ప్రాంతంలో ఉన్న రెండు కోట్లు విలువ చేసే ల్యాండ్ సెటిల్‌మెంట్‌కు వెళ్లిన సందీప్‌కు మణికంఠ ఎదురు తిరిగాడు. దీంతో నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు సందీప్‌. దీంతో ఇరువర్గాలు…. పటమట  సెంటర్ సమీపంలోని తోటవారి వీధిలో ఘర్షణకు దిగారు. ఈ దాడిలో సందీప్‌కు తీవ్ర గాయాలుకాగా.. అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సందీప్‌ చనిపోయాడు. 

బెజవాడ గ్యాంగ్‌వార్‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సీరియస్‌ అయ్యారు. విజయవాడ సీపీకి ఫోన్‌ చేసి… ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఉద్రిక్తతలు చోటు చేసుకున్న శ్రీనివాస్‌నగర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ వివాదంలో ఎంతటి వారున్నా.. కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వాస్తవానికి ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న బెజవాడ గ్యాంగ్‌వార్‌తో మరోసారి ఉలిక్కిపడింది. ఎప్పుడు ఏం జరుగుతుందోన్న భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నాయి. ఇది అసలు సందీప్‌, పండు మధ్య వివాదం కాదని… ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య వివాదమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్‌లో విద్యార్థులు ఉండడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. (విశాఖలో నాటుసారా అనుకుని స్పిరిట్ ముగ్గురు మృతి)