గన్నవరం మిస్సింగ్ కేసు, నా భార్య ఎక్కడ – భర్త ఆవేదన

గన్నవరం మిస్సింగ్ కేసు, నా భార్య ఎక్కడ – భర్త ఆవేదన

Gannavaram Missing Case : గన్నవరం మిస్సింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. మిస్సింగ్‌ అయిన దుర్గ కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామన్నారు గన్నవరం సీఐ శివాజీ. అయితే ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం దొరకలేదని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెలమూరుకు చెందిన దుర్గ అనే మహిళ ఈనెల 16న కువైట్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చింది.

ఆమె విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తన లగేజీతో దుర్గ బయటకు వస్తున్నట్టు అందులో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన తర్వాతే ఆమె అదృశ్యమైంది. దీంతో ఆమె భర్త గన్నవరం పోలీసులను ఆశ్రయించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఎవరైనా ఆమెను కిడ్నాప్‌ చేశారా.. లేక ఆమె ఎటైనా వెళ్లిపోయిందా… లేక ఏదైనా ప్రమాదానికి గురైందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విమానాశ్రయం పార్కింగ్‌ స్థలంలో సీసీ కెమెరాలు పని చేయకపోవంతో దర్యాప్తులో ఆటంకం ఏర్పడింది.

తన భార్య మిస్సింగ్‌ అవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు దుర్గ భర్త సత్యనారాయణ. దుర్గ తనకు చెప్పకుండానే ఇండియాకు వచ్చిందని.. కువైట్ నుంచి ఆమె స్నేహితురాలు ఫోన్ చేసి దుర్గ ఇండియా వచ్చిందని తెలిపాడాయన. వెంటనే దుర్గ కోసం పిల్లలతో ఎయిర్‌పోర్టుకు వెళ్లానని.. కానీ అక్కడ ఆమె కనిపించలేదన్నారు సత్యనారాయణ. వెంటనే సీసీ ఫుటేజ్‌ పరిశీలించగా దుర్గ కనిపించిందని.. అక్కడి నుంచి ఆమె ఎక్కడకు వెళ్ళిందో తెలియడం లేదన్నారు. దుర్గను కిడ్నాప్‌ చేశారనే అనుమానం వ్యక్తం చేశాడు.