విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..స్పీకర్‌ ఫార్మాట్‌లో ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..స్పీకర్‌ ఫార్మాట్‌లో ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా

Ganta Srinivasa Rao resigns to mla post : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు మరోసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఏం చేయడానికైనా తాను సిద్ధమేనని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇందుకోసం ఇప్పటికే తాను రాజీనామా చేశానన్నారు. స్పీకర్‌ ఫార్మేట్‌లో రాజీనామా ఇవ్వలేదని కొందరు అంటున్నారని… స్పీకర్‌ ఏ ఫార్మాట్‌లో కోరితే ఆ ఫార్మాట్‌లో ఇస్తున్నానన్నారు. ఈ మేరకు శుక్రవారం (ఫిబ్రవరి 12, 2021)న మరోసారి కార్మికుల ఎదుటే రాజీనామా చేశారు.

కూర్మనపాలెం గేట్‌ దగ్గర కార్మికసంఘాల రిలే నిరాహారదీక్షలో రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేయవల్సిందిగా జర్నలిస్టులను కోరారు. తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. స్టీల్‌ ప్లాంట్‌ రక్షణకు ప్రతి ఒక్కరూ కదలిరావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల ఆందోళనకు గంటా శ్రీనివాసరావు మద్దతు పలికారు.

విశాఖ ఉక్కు ఉద్యమం రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఉద్యమంలో పాల్గొనకపోతే ఒక ఇబ్బంది.. పాల్గొంటే మరో ఇబ్బంది నేతలను కాచుకుని ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో నేతలు ఉద్యమ బాట పడుతున్నారు. విశాఖ స్టీల్‌ ప్రైవేటుపరమవుతుందనే వార్తలతో ఏపీలో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.

కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అది రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగింది. ఉనికి కాపాడుకోవాలంటే స్టీల్‌ ప్లాంట్‌పై పట్టు నిలుపుకోవాల్సిన పరిస్థితి రాజకీయ నేతలది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.