తీవ్ర విషాదం.. అంగన్‌వాడీ కేంద్రంలో పాముకాటుకు చిన్నారి మృతి, అక్కకు తోడుగా వెళ్లి..

కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అంగన్ వాడీ కేంద్రంలో పాముకాటుకు చిన్నారి మృతి చెందింది. బంటుమిల్లి మండలం రామవరపుమోడిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తీవ్ర విషాదం.. అంగన్‌వాడీ కేంద్రంలో పాముకాటుకు చిన్నారి మృతి, అక్కకు తోడుగా వెళ్లి..

Girl Dies Of Snake Bite In Anganwadi Center1

girl dies of snake bite in anganwadi center: కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అంగన్ వాడీ కేంద్రంలో పాముకాటుకు చిన్నారి మృతి చెందింది. బంటుమిల్లి మండలం రామవరపుమోడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగ అనూష, నాగ మల్లేశ్వరరావు దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు గూడవల్లి వర్షిణి(4) స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తోంది. రోజూ లాగే వర్షిణి అంగన్ వాడీ కేంద్రానికి బయలుదేరింది. అయితే ఆ చిన్నారితోపాటు చెల్లెలు స్నేహస్వాతి(3) కూడా మంగళవారం(మార్చి 16,2021) అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లింది. అక్కడ తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఊహించని ఘోరం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ పాము లోనికి వచ్చింది. కోడిగుడ్ల ట్రే పక్కన ఉన్న తాచుపాము స్వాతిని కాటేసింది.

వెంటనే చేయి నొప్పిగా ఉందని చిన్నారి ఏడవడంతో అంగన్‌వాడీ కేంద్రం సిబ్బంది ఇంటికి పంపించారు. పాము కరిచిందనే అనుమానంతో కుటుంబీకులు తొలుత నాటువైద్యం చేయించారు. ఆ తర్వాత కృత్తివెన్ను మండలంలోని చిన్నపాండ్రాక ఆసుపత్రికి పాపను తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన డాక్టర్లు.. పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మచిలీపట్నం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. 108 వాహనంలో తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో చిన్నారి ప్రాణాలు విడిచింది. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురి మరణంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.

అధ్వానంగా అంగన్‌వాడీ పరిసరాలు:
గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రానికి శాశ్వత భవనం లేక కొన్నేళ్లుగా స్థానిక పంచాయతీ భవనంలోనే నిర్వహిస్తున్నారు. ఈ భవనం సైతం శిథిలావస్థకు చేరింది. దీంతోపాటు పరిసరాలు అపరిశుభ్రతకు నిలయంగా మారాయి. ప్రహరీ లేకపోవడం, సమీపంలో పొదలు ఎక్కువగా ఉండటంతో విష పురుగులు, పాములు కేంద్రంలోకి వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్ వాడీ కేంద్రాలకు పంపుతున్నారు. పాముకాటుతో వారంతా ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల క్షేమం గురించి బెంగ పెట్టుకున్నారు. అంగన్ వాడీ కేంద్రం పేరు చెబితేనే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది.