ఎవరి వాదన వారిది : GN RAO కమిటీ రిపోర్టు..స్వాగతించిన వైసీపీ, బీజేపీ

  • Published By: madhu ,Published On : December 21, 2019 / 12:42 AM IST
ఎవరి వాదన వారిది : GN RAO కమిటీ రిపోర్టు..స్వాగతించిన వైసీపీ, బీజేపీ

రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై GN RAO కమిటీ సమర్పించిన నివేదికను వైసీపీ, బీజేపీలు  స్వాగతించాయి. జీఎన్‌ రావు కమిటీ ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా నివేదికను రూపొందించిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

అమరావతిలో అసెంబ్లీ, రాజ్‌ భవన్‌తోపాటు సీఎం క్యాంపు  కార్యాలయం ఉంటాయని చెప్పారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం సాయంత్రం కమిటీ రిపోర్టును సీఎం జగన్‌కు అందచేసింది. 

టీజీ వెంకటేష్ : – 
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం స్వాగతించదగిన విషయమన్నారు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్. కర్నూలులో మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంతోకాలంగా కర్నూల్లో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ప్రజాభీష్టాన్ని ఆయన గుర్తు చేశారు.

అమరావతిలో సచివాలయం ఏర్పాటు  చేయాలని.. విశాఖకు రాజధాని హంగులు ఉన్నట్లే అమరావతి, కర్నూల్లో కూడా ఉండాలని టీజీ అభిప్రాయపడ్డారు. మంత్రులు ఒకచోట, సీఎం ఒకచోట ఉండటం మంచిది కాదన్నారు. ఇదేవిధంగా వ్యవహరిస్తే  భవిష్యత్తుల్లో విభజన తప్పదని ఆయన హెచ్చరించారు. 

బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు : – 
GN RAO కమిటీ సిఫారసులను బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు స్వాగతించారు. విశాఖలో సచివాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రకటన ఆనందంగా ఉందన్నారు. కమిటీ సిఫారసులతో మూడు ప్రాంతాల్లో అభివృద్ధి  జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

అయితే అమరావతి రైతులకు నష్టం కలగకుండా సీఎం చూడాలని విజ్ఞప్తి  చేశారు. జీఎన్‌రావు కమిటీ నివేదికను అధికార వైసీపీ, బీజేపీలు స్వాగతిస్తే.. తెలుగుదేశం పార్టీ మాత్రం వ్యతిరేకిచింది. కమిటీ రిపోర్ట్‌ను ప్రభుత్వ నివేదికగా అభివర్ణించింది. 
Read More : జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదు