ఏపీ కలిసొస్తే గోదావరి, కృష్ణ అనుసంధానం : సీఎం కేసీఆర్

  • Published By: veegamteam ,Published On : August 29, 2019 / 11:25 AM IST
ఏపీ కలిసొస్తే గోదావరి, కృష్ణ అనుసంధానం : సీఎం కేసీఆర్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే జిల్లా స్వరూపమే మారిపోపోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామన్నారు. రాబోయే పది నెలల్లో ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని చెప్పారు. హైదరాబాద్ లో భూములు అమ్మి పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టు పూర్తి అయితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. రంగారెడ్డి జిల్లాలోని భూభాగమంతా సస్యశ్యామలవుతుందన్నారు. భవిష్యత్ లో పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు బాగుపడతాయన్నారు. గురువారం (ఆగస్టు 29, 2019) వ తేదీన వనపర్తి జిల్లాలో పర్యటించిన సీఎం ఏదుల ప్రాజెక్టు పనులను పరిశీలించారు. హైదరాబాద్ లో తాగునీటి కొరత లేకుండా చేస్తామని చెప్పారు. మన రాష్ట్రంలో ఉన్నన్ని పంపుసెట్లు దేశంలో ఎక్కడా లేవన్నారు. 
 
గోదావరి జలాలను కృష్ణానదిలో కలిపేందుకు ఏపీ సీఎం జగన్ ముందుకొచ్చారని తెలిపారు. తామిద్దరం ఒక అభిప్రాయానికి వచ్చినట్టు వెల్లడించారు. ఆంధ్రా-తెలంగాణ ఒప్పందాలు చేసుకుని కృష్ణా, గోదావరి జలాలను కలిసి పంచుకుంటామని చెప్పారు. నీటి ఎద్దడిని తట్టుకోవాలంటే గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేయడం ఉత్తమైన మార్గమన్నారు. దానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మనకు కూడా లాభం ఉందన్నారు. వచ్చే మీటింగ్ లో ఓ కొలిక్కి వచ్చే అవకాశముందన్నారు.

గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించాలనే ప్రతిపాదన ఉందని…నదీ జిలాలను కలిసికట్టుగా వాడుకుందామని నిర్ణయించుకున్నామని తెలిపారు. త్వరలో గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేస్తామన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పారు. కొందరు తెలివి తక్కువ ఆలోచనలతో పాలమూరును ఎండబెట్టారని చెప్పారు.

గత పాలకులు పాలమూరును వలస జిల్లాగా మార్చారని విమర్శించారు. ఆషామాషీగా తమాషాగా మాటలు చెప్పమని… ఎన్నివేల కోట్లు ఖర్చు పెట్టైనా రైతులకే నీళ్లు ఇస్తామని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతలకు జూరాల నీళ్లు తీసుకోమని కొందరు చెబుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు పూర్తయిందన్నారు. 

కృష్ణా, గోదావరి జలాలను కలపాలని చూస్తుంటే చంద్రబాబు సంకుచిత ఆలోచళనలతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బాబ్లీ గొడవతో చంద్రబాబు సాధించింది శూన్యమని ఎద్దేవా చేశారు. ఆయనను ఏమీ అనలేమన్నారు. చంద్రబాబుకు ఏ గుణముందో ఇతరులకు కూడా అదే గుణముంటుందని అనుకుంటున్నారని తెలిపారు. ఎవరైతే కుచ్చితంగా, సంకుచితంగా, నీచంగా ఆలోళన చేస్తారో.. వాళ్లకే చంద్రబాబు లాంటి ఆలోచనలు వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీళ్లు కళ్లముందు కనిపిస్తుంటే కొంతమంది డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.