సంక్రాంతి కోళ్ల పందాలు : పోతే వేలు..వస్తే లక్షలు

  • Published By: madhu ,Published On : January 16, 2020 / 12:57 AM IST
సంక్రాంతి కోళ్ల పందాలు : పోతే వేలు..వస్తే లక్షలు

పోతే వేలు.. వస్తే లక్షలు.. ఓవరాల్‌లో చేతులు మారేది కోట్లకు కోట్లు. అందుకే, కోడిపందేల కోసం ఎక్కడెక్కడి నుంచో గోదావరి జిల్లాల్లో వాలిపోయారు. చూడ్డానికి మాత్రమే కాదు.. పందెం కాయడానికే ఎక్కువ మంది దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఊరికి దూరంగా, పచ్చని పొలాలు, తోటల్లో బరులు ఏర్పాటు చేశారు. అయితే, ఇవేం గుట్టుగా మాత్రం సాగడం లేదు. అంతా పబ్లిగ్గానే జరుగుతోంది. 

 

తిరునాళ్లు
కృష్ణా జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు యథేచ్చగా జరిగాయి. మైలవరం, కొత్తూరు, తాడేపల్లి, నున్న, నూజివీడు, పామర్రు, పెనమలూరు, జగయ్యపేటలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. కోళ్లకు కత్తులు, రక్తపు మరకల మధ్యే రెండోరోజు కోళ్ల పందేలు జరిగాయి. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో కోడి పందేలు జోరుగా నడిచాయి. కొల్లూరు మండలం క్రాప గ్రామంలో అధికార పార్టీ ఆధ్వర్యంలో కోడిపందేలు, పేకాట యథేచ్ఛగా జరిగాయి. గ్రామ శివారులో ఏర్పాటుచేసిన కోడి పందేలు తిరునాళ్లను తలపించాయి. వైసీపీ టీ టీ షర్టులు ధరించి మరీ కోడి పందేలు జరిపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో కోడిపందాలు, పేకాట, గుండాటలు యధేచ్చగా జరిగాయి. 

విషాదం
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో జరిగిన కోడి పందేల్లో విషాదం చోటుచేసుకుంది. కోడి కత్తి మర్మాంగాలకు తగలటంతో వెంకటేష్ అనే వ్యక్తి చనిపోయాడు. పందెంలో కోళ్లు కొట్టుకుంటుండగా.. ఎదురుగా ఉన్న వెంకటేష్ పైకి కత్తి కట్టిన కోడి దూసుకొచ్చింది. కోడి కత్తి మర్మాంగాలను కట్ చేయడంతో వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు.

 

పందాల్లో గొడవలు 
కోడి పందేలు జరిగే చోట గొడవలు కూడా జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కుర్చీలు గాల్లో లేచాయి. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం కవ్వగుంటలో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. పేకాట లెక్కల్లో తేడా రావడంతో.. కుర్చీలు, కర్రలతో కొట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం కివ్వాడలో కూడా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. రెండు వర్గాల మధ్య గొడవ.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. ఈ ఘర్షణలో కొంతమందికి గాయాలయ్యాయి. 

రూ. 300 కోట్ల పందాలు 
గోదావరి జిల్లాల్లోనే కాదు.. కోస్తాలోని అన్ని జిల్లాల్లో కోడిపందేలకు వేదికలుగా మారాయి. కాని, ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడిపందేల కోసమే ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అందుకే, కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లో.. పండగ మూడు రోజుల్లో సుమారు 300 కోట్ల రూపాయల వరకు పందేలు సాగుతాయన్నది ఓ అంచనా.

రాజకీయ నాయకుల సపోర్టు
ముఖ్యంగా రాజకీయ నాయకుల సపోర్టు ఉండడంతో.. టెంట్లు, ఫెన్సింగ్‌లు, కూర్చోడానికి మెత్తటి సోఫాలు వేసి మరీ పందేలు ఆడించారు. కోడి పందేలంటే చాలు.. ఆ పార్టీ ఈ పార్టీ అని అండదు. అందరూ కలిసిపోతారు. పోలీసులు రావొద్దని అధికారపార్టీ నాయకులతోనే చెప్పించడం ఆనవాయితీగా వస్తుంది. చింతమనేని ప్రభాకర్, తలసాని శ్రీనివాస్, రఘురామకృష్ణంరాజు.. ఇలా నేతలే స్వయంగా కోడిపందేలు చూడ్డానికి వచ్చారు. పందెంరాయుళ్లకు పొలిటికల్‌ పవర్‌ అండగా ఉండడంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు.