తిరుమలకు వాహనాల్లో వెళుతున్నారా..కొత్త నిబంధనలు తెలుసుకోండి

  • Published By: madhu ,Published On : November 12, 2020 / 10:40 AM IST
తిరుమలకు వాహనాల్లో వెళుతున్నారా..కొత్త నిబంధనలు తెలుసుకోండి

Going to Tirumala in vehicles..Learn the new rules : తిరుమల కొండపైకి వాహనాల్లో వెళ్లాలనుకునే భక్తులు ఇకపై కొత్తగా వచ్చిన నిబంధనలు తెలుసుకోవాల్సిందే. బస్సులు, ట్రైన్‌ సదుపాయం సరిగ్గా లేకపోవడంతో సొంత వాహనాల్లో భక్తులు స్వామి దర్శనం కోసం కొండపైకి వెళ్తున్నారు. పాతవాహనాల్లో శ్రీవారి మొక్కులు చెల్లించేకునేందుకు పయనం అవుతున్నారు. అయితే ఇలా వెళ్లే వారికి అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు.



పాతవాహనాల్లో, కాలం చెల్లిన వాహనాల్లో కొండపైకి వచ్చే భక్తులను అధికారులు నిలిపివేస్తున్నారు. ముఖ్యంగా ఘాట్ రోడ్‌లలో ప్రమాదాల నివారణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కండీషన్ లేకుండా, ఫిట్ నెస్ లేకుండా, టైర్లు అరిగిపోయిన వాహనాలు, ఇంజిన్లు సరిగ్గా పనిచేయని వాహనాలు ఘాట్ రోడ్లలో నిలిచిపోతున్నాయని, కొన్నిసార్లు ప్రమాదానికి గురవుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంచి కండీషన్, ఫిట్ నెస్ ఉన్న వాహనాల్లో కొండపైకి వెళ్లాలని సూచిస్తున్నారు.



పాతబడిన వాహనాలను తిరుమలకు తీసుకురాకుండా ఉండేందుకు భక్తుల కోసం ఆర్టీఏ, పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పలు వాహనాలు రికార్డులను పరిశీలించారు. సొంత వాహనంలో వచ్చే భక్తులు అనుభవం ఉన్న డ్రైవర్ ను తమ వెంట తీసుకురావాలని, సరిగ్గా డ్రైవింగ్ చేయలేని వాళ్ళు ఘాట్ రోడ్ లో ప్రయోగాలు చేయొద్దని సూచించారు. తిరుమల పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్యాన్ని తగ్గించేందుకు ఫిట్ నెస్ లేని వాహనాలు, పాత వాహనాలను ఘాట్ రోడ్డులోకి తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు.



స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు.. క్షేమంగా తిరుమల పర్యటన ముగించుకోవాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే తాము ఈ చర్యలను చేపట్టినట్లు వెల్లడించారు. తిరుమల కొండపైనా, ఘాట్ రోడ్ లో ప్రమాదాల నివారణ, మరియు పర్యావరణం పరిరక్షణపై రవాణాశాఖ మరియు పోలీసు అధికారులు దృష్టి సారించారు. భక్తులు పాతబడిన వాహనాలను తిరుమలకు తీసుకురాకుండా చర్యలు చేపడుతున్నారు. తిరుమల పర్యావరణ పరిరక్షణ కోసం ఫిట్ నెస్ లేని వాహనాలు పాత వాహనాలను కొండపైకి తీసుకురావద్దని కోరుతున్నారు.