పెన్షనర్లకు గుడ్ న్యూస్ : ఏప్రిల్ నెల మొత్తం పెన్షన్

పెన్షనర్లకు గుడ్ న్యూస్ : ఏప్రిల్ నెల మొత్తం పెన్షన్

పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించారు సీఎం జగన్. ఏప్రిల్ నెలలో పూర్తి పెన్షన్ చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అన్ని రకాల పెన్షనర్లకు ఏప్రిల్ పూర్తి స్థాయిలో పెన్షన్ చెల్లించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని 2020, ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న విషయం తెలిసిందే.

దీనితో పలువురి వేతనాల్లో కోత విధించింది ఏపీ ప్రభుత్వం. మార్చి మంత్ లో పెన్షనర్లకు 50 శాతం చెల్లించింది ఏపీ ప్రభుత్వం. ఈ చెల్లింపులపై ప్రభుత్వం పునరాలోచన చేసింది. కరోనా వైరస్ కట్టడికి, రోగులకు సేవలందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు సిబ్బంది, గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో పనిచేసే పారిశుధ్య సిబ్బందికి ఏప్రిల్ నెల పూర్తి వేతనాలను చెల్లించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ మిగతా ఉద్యోగులందరికీ (నాలుగో తరగతి సిబ్బంది మినహా) మార్చి నెల తరహాలోనే ఏప్రిల్ వేతనాల్లో కూడా 50 శాతం చెల్లించి..మిగతా 50 శాతం వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నాలుగో తరగతి ఉద్యోగుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వారి వేతనాల్లో 10 శాతం వాయిదా వేసి మిగతా 90 శాతం జీతం చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విధానం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. అఖిల భారత సర్వీసు విభాగాలైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులందరికీ ఏప్రిల్ నెల జీతాల్లో 40 శాతం మాత్రమే చెల్లించనున్నారు. మిగతా 60 శాతం వాయిదా వేయనున్నారు.