Tirumala Rental Rooms : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరింత సులభంగా, వేగంగా అద్దె గదులు

తిరుమల శ్రీవారి భక్తులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇకపై భక్తులకు మరింత వేగంగా, సులభంగా అద్దె గదులు దొరకనున్నాయి.

Tirumala Rental Rooms : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరింత సులభంగా, వేగంగా అద్దె గదులు

Tirumala Rental Rooms

Tirumala Rental Rooms : తిరుమల శ్రీవారి భక్తులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇకపై భక్తులకు మరింత వేగంగా, సులభంగా అద్దె గదులు దొరకనున్నాయి. భక్తులకు సులభంగా, వేగంగా అద్దె గదులు కల్పించాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలో అద్దె గది కోసం ఆన్ లైన్ లో రిజర్వేషన్ చేసుకున్న భక్తులు గదుల స్లిప్పులను తిరుపతిలోనే స్కాన్ చేసుకోవాలని సూచించారు. అలిపిరి టోల్ గేట్, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. తిరుమలకు రోడ్డు మార్గంలో వెళ్లేవారికి స్లిప్పులు స్కాన్‌ చేసుకున్న 30 నిమిషాల్లో, అలిపిరి నడకమార్గంలో వెళ్లేవారికి 3 గంటల్లో, శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లేవారికి గంటలో ఎస్‌ఎంఎస్‌లు వస్తాయన్నారు. ఎస్ఎంఎస్ రాగానే భక్తులు నేరుగా విచారణ కార్యాలయానికి వెళ్లి గదులు పొందొచ్చని తెలిపారు.

టీటీడీ పరిపాలన భవనంలో గురువారం వసతి కల్పనకు నూతనంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌పై అధికారులతో ఈవో సమీక్షించారు. అనంతరం టీటీడీ కాల్‌ సెంటర్‌ ద్వారా వస్తున్న పలు ఫిర్యాదులను విభాగాల వారీగా సమీక్షించారు. అంతకుముందు రిసెప్షన్‌ అధికారులు నూతనంగా రూపొందించిన అకామిడేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌పై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఈవోకు వివరించారు.

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశ విదేశాల నుంచి స్వామి వారి దర్శనం కోసం భక్తులు వస్తారు. దూరం నుంచి కుటుంబసభ్యులతో వచ్చే భక్తులు అద్దె గదుల విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె గదులు దొరక్క అవస్థలు పడుతున్నారు. అద్దె గదుల కోసం పెద్ద పెద్ద క్యూలైన్లు ఉంటున్నాయి. గంటల గంటలు నిరీక్షించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో టీటీడీ ఈవో చేసిన ప్రకటన భక్తులకు కాస్త ఊరట కలిగించే అంశం.