దుర్గగుడి ప్రక్షాళనకు ప్రభుత్వం కసరత్తు..అక్రమార్కులకు చెక్

దుర్గగుడి ప్రక్షాళనకు ప్రభుత్వం కసరత్తు..అక్రమార్కులకు చెక్

irregularities in Vijayawada Durgamma temple : విజయవాడ దుర్గమ్మ గుడిలో అక్రమాలు వెలుగు చూడటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఏసీబీ నివేదికల ఆధారంగా అక్రమార్కులకు చెక్ పెడుతోంది. మొత్తం 16 మందిపై దేవాదాయ శాఖ వేటు వేసి హెచ్చరికలు జారీ చేసింది. ప్రఖ్యాత కనకదుర్గమ్మ గుడి అక్రమాల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మూడు రోజులు సోదాలు చేసిన ఏసీబీ ఇంటి దొంగల గుట్టు రట్టు చేసింది. అక్రమార్కుల చిట్టాలను తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మొత్తం 16 మందిపై వేటు వేసింది.

అన్నదానం, ప్రసాదాలు, టికెట్ల అమ్మకాలు, శానిటేషన్‌, సెక్యూరిటీ టెండర్లు, అమ్మవారి చీరల విభాగాల్లో అవకతవకలపై నివేదిక ఇచ్చింది ఏసీబీ. టెండర్లను రీకాల్‌ చేయాలన్న అధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ రిపోర్ట్‌ ఆధారంగా పలు డిపార్ట్‌మెంట్లలోని సూపరింటెండెంట్లను, సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వానికి ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెన్షన్‌ ఆదేశాలిచ్చారు దేవాదాయశాఖ కమిషనర్

దీంతో పాటు కేశఖండనశాలలోనూ పలు అక్రమాలపైనా దృష్టి పెట్టారు. దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారి ప్రత్యేక దర్శనం టికెట్లు ధరలు పెంచడం, అడ్వాన్స్‌ బుకింగ్ లేకుండా ఆలయానికి వచ్చిన వారికి అధిక ధరలకు టికెట్లు విక్రయించి దర్శనానికి అనుమతించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఏసీబీ లిస్టులో ఇంకా ఎవరు ఉన్నారన్న టెన్షన్ ఉద్యోగుల్లో ఉంది. నెక్ట్స్ ఎవరి పేరు బయటకు వస్తుంది, ఎవరిపై వేటు పడుతుందనేది సస్పెస్స్‌గా మారింది. ఏసీబీ ఇచ్చిన నివేదికలో ఓ కీలక వ్యక్తి పేరును ప్రధానంగా ప్రస్తావించినట్టు ప్రచారం సాగుతోంది. మరి ఇంకెన్ని తొలగింపులు ఉంటాయో తేలాల్సి ఉంది.