త్వరలోనే సచివాలయాల్లో భూమి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తాం, మంత్రి కొడాలి నాని

  • Published By: naveen ,Published On : October 2, 2020 / 03:06 PM IST
త్వరలోనే సచివాలయాల్లో భూమి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తాం, మంత్రి కొడాలి నాని

grama sachivalayam: ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలనే సదుద్దేశ్యంతో సీఎం జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘స్థానికంగా ఉ‍న్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్న యువతకు ఉపాధి కలగడంతో పాటు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడేది సచివాలయ వ్యవస్థ. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో గ్రామ సచివాలయాల్లో అన్ని కార్యక్రమాలను అమలు చేయనున్నాం. త్వరలో గ్రామ సచివాలయాల పరిధిలోనే భూమి రిజిస్ట్రేషన్లు ప్రక్రియను ప్రారంభిస్తాం. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం. ఇది రాబోయే రోజుల్లో దేశానికి ఆదర్శంగా ఉంటుంది.

ఇటీవల ప్రధాని మోడీ కూడా మన సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉందని చెప్పటం, దేశంలో ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ఆ దిశగా ఆలోచన చెయ్యాలని చెప్పటం మనకు గర్వకారణం. గ్రామ సచివాలయాల్లో ఉన్న సిబ్బందికి ప్రతి మూడు నెలలకు పరీక్ష పెట్టి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చెయ్యనున్నట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు.

ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభించి శుక్రవారంతో(అక్టోబర్ 2,2020) ఏడాది పూర్తవుతుంది. ప్రభుత్వ పాలన, సేవలు, పథకాలు ప్రతి ఇంటి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సచివాలయ వ్యవస్థ ప్రారంభించారు సీఎం జగన్. అవినీతికి తావు లేకుండా 543 సేవలను గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్నామన్నారు. అవినీతి రహిత పాలనను ప్రభుత్వం అందిస్తోందని.. సచివాలయ పనితీరుని మన దేశ ప్రధాని నరేం‍ద్రమోదీ అభినందించారన్నారు. కేంద్ర కేబినెట్ సెక్రటరీ కూడా ప్రత్యేకంగా మన సచివాలయ వ్యవస్థని అభినందించారని తెలిపారు.

లక్షా 26వేల 200 మంది ఇప్పటి వరకు గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నారని.. 4 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానిది అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను అభినందించేందుకు శుక్రవారం సాయంత్రం 7 గంటలకు అందరూ ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి అభినందించాలని కోరారు. ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 61లక్షల 65వేల మందికి పెన్షన్లు గత నెల వరకు ఇస్తున్నామన్నారు మంత్రి. 34వేల 907 మందిని గత నెల కొత్తగా పెన్షన్ ఇచ్చే జాబితాలో చేర్చామని.. గత ప్రభుత్వం మాదిరి కాకుండా తమ ప్రభుత్వంలో ఈ పెన్షన్‌ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది అన్నారు.

గడప వద్దకే సేవలు:
గ్రామ సచివాలయాల్లో 13 శాఖల ఉద్యోగులు, వార్డు సచివాలయాల్లో పది శాఖల ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజల సమస్యలపై ఫిర్యాదులు, సంక్షేమ పథకాల కోసం ఆర్జీలు స్వీకరిస్తున్నారు. దాదాపు 592 రకాల ఎలక్ట్రానిక్‌ (ఇ)-సేవలను అందించడంతో పాటు ‘స్పందన’ కార్యక్రమం కూడా జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తున్నారు. అక్కడ అందే విజ్ఞాపనలు నిర్ణీత కాలంలో పరిష్కారమవుతున్నాయో లేదోనని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డ్యాష్‌ బోర్డు నుంచి పర్యవేక్షించడం విశేషం. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలు ప్రజల గడప వద్దకే అందించాలన్న ఆయన ఆశయానికి అనుగుణంగా పనిచేయడంలో గ్రామ, వార్డు సచివాలయాలు సఫలమవుతున్నాయి.

పారదర్శకంగా అర్హుల ఎంపిక:
ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో అర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శిస్తున్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ, పేదలందరికీ ఇళ్లు, రజకులు-నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఆర్థిక సాయం, జగనన్న ‘అమ్మ ఒడి’ పథకం, బియ్యం కార్డు, వైఎస్సార్‌ పింఛను కానుక, వైఎస్సార్‌ కాపు నేస్తం, జగనన్న ‘విద్యాదీవెన’-జగనన్న ‘వసతి దీవెన’, వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌.. ఇలా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారంతో రూపొందించిన పోస్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఎవరైనా తమకు ఏ పథకమైనా అందకపోతే గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహిస్తున్న ‘స్పందన’లో ఫిర్యాదు చేయవచ్చు. దీన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి, దాన్ని పరిష్కరించే బాధ్యత సచివాలయ సిబ్బందికే ప్రభుత్వం అప్పగించింది. ఇలా ప్రజల నుంచి విజ్ఞాపనలు, దరఖాస్తులను స్వీకరించడం, పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేయడం వారి చెంతనే జరుగుతోంది. కేవలం ఎంపీడీవోలు, కలెక్టర్‌ పాత్ర ఆమోదముద్ర వేయడం వరకే.

సచివాలయ సేవలకు నిదర్శనాలు..
ప్రజలకు సంబంధించిన ప్రతి డేటా ఆన్‌లైన్‌లో నిక్షిప్తం అయ్యింది. ప్రతి ఇంట్లో సభ్యుల ప్రతి సమాచారం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయంలో సచివాలయ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు ఏదైనా డేటా కావాలంటే నెలలు గడిచిపోయేవి. ఇప్పుడు నిమిషాల్లో అందుబాటులోకి వచ్చింది.