Guntur Bongaralabeedu : గుంటూరు బొంగరాలబీడు స్మశాన వాటిక.. రెండు రోజుల్లో 92 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు

కోవిడ్ విశ్వరూపమేంటో గుంటూరు జిల్లాలోని ఈ స్మశానవాటికను చూస్తే తెలిసిపోతుంది. ఎటు చూసినా తగలబడుతున్న చితులే కనిపిస్తాయి.

Guntur Bongaralabeedu : గుంటూరు బొంగరాలబీడు స్మశాన వాటిక.. రెండు రోజుల్లో 92 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు

Guntur Bongarala Beedu Cemetery Funeral For 92 Corona Dead Bodies In Two Days

Guntur Bongaralabeedu Cemetery : దేశమంతా కోవిడ్ గుప్పిట్లో భయం భయంగా గడుపుతోంది. ఎప్పుడు ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితుల్లో చాలామంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో స్మశానాలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఇక కోవిడ్ విశ్వరూపమేంటో గుంటూరు జిల్లాలోని ఈ స్మశానవాటికను చూస్తే తెలిసిపోతుంది. ఎటు చూసినా తగలబడుతున్న చితులే కనిపిస్తాయి.

గుంటూరు బొంగరాలబీడు స్మశానవాటికు వచ్చే మృతదేహాల్లో ఎక్కువగా కరోన మృతదేహాలే ఉండడం కలవరపెడుతోంది. ఇక్కడ గత రెండు రోజుల్లో భారీ సంఖ్యలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. మంగళ, బుధ వారాల్లో ఏకంగా 92 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. సాధారణ రోజుల్లో ఈ స్మశానంలో రోజుకు 4 నుంచి 5 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. కానీ ఇటీవలి కాలంలో ఈ సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన నాలుగు రోజుల్లో ఏకంగా 141 మృతదేహాలకు ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించారు.

ఇక్కడికి వస్తున్న మృతదేహాల్లో 80శాతం మృతదేహాలను ప్లాస్టిక్ కవర్లలో చుట్టి… జిప్ వేసి పంపిస్తున్నారు. కోవిడ్‌తో మరణించినవారి మృతదేహాలకు మాత్రమే ఇలాంటి ఏర్పాట్లు చేస్తారు. జీజీహెచ్, కొత్తపేటలోని ప్రేవేట్ ఆస్పత్రుల నుంచి ఇక్కడికి మృతదేహాలను తరలిస్తున్నారు. బొంగరాలబీడుతో పాటు గుంటూరులోని మొత్తం 11 స్మశాన వాటికలకు మృతదేహాల తాకిడి ఎక్కువైంది.

ఇక్కడి స్మశానాలకు తరలిస్తున్న మృతదేహాల్లో 90శాతం కోవిడ్ మరణాలేనని తెలుస్తోంది. అయితే కొందరి డెత్ సర్టిఫికెట్‌లో మాత్రం గుండెపోటుతో, దీర్ఘకాలిక వ్యాధులతో చనిపోయినట్లుగా చూపిస్తున్నారు. కోవిడ్ మరణాలు కాబట్టి మృతదేహాల వెంట కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ రావట్లేదు.

దీంతో శ్మశాన సిబ్బందితో పాటు కొన్ని స్వచ్చంద సేవా సంస్థలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు విరామం లేకుండా పనిచేయాల్సి వస్తోందని… నిద్రాహారాలు కూడా మానుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోందని ఒక ఛారిటబుల్ ట్రస్టు సభ్యుడు తెలిపారు.