టీడీపీ నేతలపై చర్యలు తీసుకోకపోతే అరాచకమే : అంబటి రాంబాబు

టీడీపీ నేతలపై చర్యలు తీసుకోకపోతే అరాచకమే : అంబటి రాంబాబు

గుంటూరు: ఎన్నికల నేరాలు చేయటంలో కోడెల శివప్రసాద రావుది మొదటి స్దానమని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11వ తేదీన గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు చేసిన దాడులపై  వైసీపీ  ఆదివారం గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబుకు  ఫిర్యాదు చేసింది. పార్టీ సీనియర్ నేత  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వంలో బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, కాసు మహేష్‌ రెడ్డి, మేరుగ నాగార్జున, మర్రి రాజశేఖర్‌ తదితరులు ఎస్పీని కలిసి జిల్లాలో గురజాల, మాచర్ల, సత్తెవపల్లి, వేమూరు, నరసరావు పేటలో జరిగిన  దాడులపై  చర్యలు తీసుకోవాలని ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.

గుంటూరు జిల్లాలో పోలీసు ఆంక్షలు అమలులో ఉన్నా కోడెల శివ ప్రసాదరావు ధర్నాలు నిరసనలు చేపట్టటంపట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  పోలీసులు ఏకపక్షంగా వైసీపీ కార్యకర్తలమీద, నాయకుల మీద కేసులు పెడుతున్నారని అంబటి ఆరోపించారు. పోలీసులు తమ వ్యవహార శైలి మార్చుకోవాలని కోరారు.  టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోకపోతే అరాచకం జరిగే అవకాశం ఉందని అంబటి హెచ్చరించారు. కాగా..   గుంటూరు జిల్లా గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్‌ (ఏప్రిల్‌ 11) రోజున, పోలింగ్‌ తర్వాత టీడీపీ శ్రేణులు పాల్పడిన దాడులు, అరాచకాలు, దౌర్జన్యాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప‍్పటికే నిజనిర్ధారణ కమిటీని నియమించారు.