సంక్రాంతి హరిదాసులు

సంక్రాంతి పండుగంటే ముందుగా గుర్తుకొచ్చేది హరిదాసులే

  • Published By: chvmurthy ,Published On : January 8, 2019 / 08:39 AM IST
సంక్రాంతి హరిదాసులు

సంక్రాంతి పండుగంటే ముందుగా గుర్తుకొచ్చేది హరిదాసులే

ధనుర్మాసం మొదలైన దగ్గర్నుంచే తెలుగు లోగిళ్లలో పండగవాతావరణం మొదలవుతుంది. ఇంటిముందు ముగ్గులు, హరిదాసులు, గంగిరెద్దులవాళ్లతో గ్రామాల్లో  పండుగ వాతావరణం వస్తుంది. దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా సంక్రాంతి పండుగకు స్వంత ఊరికి వస్తారు. సంక్రాంతి పండుగ గురించి చెప్పాలంటే  పెద్దలనుంచి పిన్నల వరకు ఎన్నెన్నోవిశేషాలు  ఉంటాయి. పట్టణాలనుంచి వచ్చే బంధువులకు పల్లెజనం స్వాగతం పలుకుతూ ఆనందోత్సాహాలతో మునిగిపోతారు. చిన్ననాడు స్వగ్రామంలో తిరిగిన తీపి గురుతులను నెమరువేసుకుంటూ  అంతా పండుగను ఎంజాయ్ చేస్తారు. ఇళ్లు అలికి సున్నాలు  వేసి సుందరంగా అలంకరిస్తారు. 
లేలేత  సూర్యకిరణాల భూమిని తాకే వేళ , ఇఁటి ముందు ఆడవారు ముగ్గులు పెట్టేవేళ,  రామదాసు కీర్తనలు,హరినామ సంకీర్తన,శ్రీ కృష్ణ లీలామృతాన్ని గానం చేసుకుంటూ కాలికి గజ్జెకట్టి తంబుర మీటుతూ,తలపై అక్షయ పాత్రతో  చేతిలో చిడతలతో  హరిదాసులు చేసే సంకీర్తనలు సంక్రాంతి పండుగవేళ కనిపించే అతి గొప్ప సాంప్రదాయాల్లో ఒకటి గా చెప్పవచ్చు. హరిదాసులు శ్రీమహావిష్ణువుకు  ప్రతిరూపాలుగా కూడా చెపుతారు. ఇంటి వారు ఇచ్చే ధన,ధాన్య,వస్తు, దానాలను తీసుకుని ఇంటింటికీ తిరుగుతూ హరిలోరంగ హరి..హరిలో రంగ హరి అంటూ ఇంటిముందు నర్తిస్తూ అందరినీ చల్లగా ఉండమని దీవిస్తూ గ్రామంలో తిరిగే హరిదాసులు నేటికి గ్రామాల్లో కనిపిస్తున్నారు. హరిదాసు తన తలపై ఉన్న అక్షయపాత్రను గ్రామసంచారం సమయంలో ఎక్కడా తీసి కింద పెట్టరు. కేవలం ఇంటికి వెళ్లాక అతనన భార్యమాత్రమే అక్షయపాత్రను కిందకు దించుతుంది. 
ఏడాదిలో  ఎప్పడూ కనపడని హరిదాసులు సంక్రాంతి పండుగ సమయంలో ధనుర్మాసం నెలరోజులు మాత్రమే కనిపిస్తారు. గ్రామాల్లో హరిదాసులు సందడి సూర్యోదయంతోటే మొదలవుతుంది. ఇలా నెలరోజులుగా తిరిగి సంవత్సరానికి సరిపడ గ్రాసాన్ని హరిదాసులు సంపాదించుకుంటారు. వీరంతా బయట వూరినుంచే వస్తారు. ఏడాదిలో  ప్రతి వూరికీ ఎవరెవరు వస్తారో వారు తప్పా ఇతరులు రారు. ముఖ్యంగా ఇలా వచ్చే వారిలో విష్ణు భక్తులైన సాతానులు……..దాసరులు, రాజులు మొదలైన వారు ఇలా జీవిస్తూ వుంటారు.
గ్రామ వీధుల్లో హరి దాసులుఇలా హరి భజన చేయడం కోలాహలంగా వుంటుంది. హరి దాసుని అక్షయ పాత్రలో బియ్యం వేయటానికి……… బాలబాలికలు పోటీలు పడతారు. హరిదాసులు ప్రతి ఇంటి ముందూ కూర్చుని లేవటం చాల కష్టమైన పని, అయినా భక్తిభావంలో అదంతా మరిచిపోతారు.
హరిదాసులతో పాటు, సంక్రాంతి పర్వ దినాలలో, గంగి రెద్దుల వారు, బుడబుక్కలవారు, పగటి వేషధారులు, గారడీ వాళ్ళు, ఎందరెందరో జానపద కళాకారులతో, కన్నుల పండువుగా సంక్రాంతి పర్వ దినాలు ముగుస్తాయి. పంటను ఇంటికి తెచ్చుకుని కళకళ లాడే రైతు కుంటుంబాలు సంక్రాంతి పర్వదినాలు ముగుస్తాయి. పంటను ఇంటికి తెచ్చుకుని కళకళ లాడే రైతు కుంటుంబాలు సంక్రాంతి సంతోషంలో అందరినీ ఆదరిస్తారు.