చలి చంపేస్తోంది…

  • Published By: veegamteam ,Published On : January 2, 2019 / 07:09 AM IST
చలి చంపేస్తోంది…

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసురుతోంది. తీవ్ర చలికి ఏపీ, తెలంగాణ గజ గజ వణుకుతన్నాయి. గత కొద్ది రోజులుగా తీవ్ర చలి గాలులు వీస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట నమోదయ్యాయి. పగలు, రాత్రి పూట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయి. ఉత్తర భారతం నుంచి వీస్తున్న శీతల గాలుల ఉధృతికి చలి తీవ్రత తగ్గడం లేదు. బుధ, గురువారాల్లో వీటి ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. 

తెలంగాణలోని ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు తీవ్ర చలి పెడుతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేకపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు చల్లటి గాలులతో తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. తీవ్ర చలికి గజ గజ వణికిపోతున్నారు. వివిధ పనులపై భయటికి వెళ్లిన జనం రాత్రి కాకముందే ఇళ్లకు చేరుకుంటున్నారు. 

మంగళవారం తెల్లవారుజామున ఆదిలాబాద్ లో 5, మెదక్ లో 6, రామగుండం, హన్మకొండ, హైదరాబాద్ లలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట సాధారణం కన్నా 8 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రత ఉండటంతో ప్రజలు చలితో గజ గజ వణుకుతున్నారు. రాత్రి సమయంలో మంచుతో వాతావరణం బాగా చల్లబడుతోంది. పగలు పొడి వాతావరణం వల్ల గాలిలో తేమ తగ్గుతుంది.

సోమ, మంగళవారం ఏపీలోని అన్నిజిల్లాలో చలి ప్రభావం తీవ్రంగా ఉంది. సోమవారం కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. కోస్తా జిల్లాలో సాధారణం కన్నా 3 నుంచి 6 డిగ్రీలు, రాయలసీమలో 3 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. చింతపల్లిలో మంగళవారం 2.5 డిగ్రీల ఉష్ణోగ్రత, కోస్తాలో అత్యల్పంగా జంగమహేశ్వరపురంలో 10.2 డిగ్రీలకు ఉష్ణోగ్రతకు పడిపోయింది. గత పదేళ్లలో ఇంత తక్కువగా ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. రాయలసీమలో అత్యల్పంగా ఆరోగ్యవరంలో 12 డిగ్రీలు నమోదు అయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తీవ్రంగానూ దక్షిణకోస్తా, రాయలసీమలో ఓ మోస్తారుగానూ చలిగాలుల ప్రభావం ఉంది. 

తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో బ్యాక్టీరియా, వైరస్ లు స్వైర విహారం చేస్తున్నాయి. చలి తీవ్రత పెరగడంతో ఫ్లూ జ్వరాలతో ఆస్పత్రుకెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. మున్ముందు చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలుండటంతో పొంచి ఉన్న చలి ముప్పును తప్పించుకోవడానికి ముందస్తు జాగ్రాత్తలు తీసుకోవాలని నిపుణలు సూచిస్తున్నారు.