తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన

  • Published By: naveen ,Published On : September 14, 2020 / 01:22 PM IST
తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం(సెప్టెంబర్ 13,2020) రాత్రి నుంచి కంటిన్యూగా వర్షం కురుస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలతో వర్షాలు పడుతున్నాయి. ఇది మరింత బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

వీటి ప్రభావంతో ఇవాళ, రేపు(సెప్టెంబర్ 14,15) కోసాంధ్రలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమలోనూ రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉండనుంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి.

తూర్పుగోదావరి జిల్లా ఏలేరు రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కాలువ కు గండి పడి కిర్లంపూడి మండలం రాజుపాలానికి వరద నీరు పోటెత్తింది. ఇళ్లలోకి వరదనీరు చేరాయి. దీంతో గ్రామస్తులు రాత్రంతా రోడ్లపైనే పడిగాపులు కాశారు.

తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు సైతం కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

కృష్ణా, దాని ఉప నదులైన తుంగభద్ర, భీమా పరవళ్లు తొక్కుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం వరకు లక్షా 35వేల 374 క్యూసెక్కులు చేరగా.. స్పిల్‌వే గేట్లు, కుడి విద్యుత్‌ కేంద్రం ద్వారా లక్షా 14వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం నుంచి కృష్ణమ్మ దిగువకు పరుగులు పెడుతున్నది. ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్నది. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 884.80 అడుగులకు చేరుకుంది.
https://10tv.in/wanted-criminal-managed-to-flee-from-the-clutches-of-the-uttar-pradesh-police/
నాగార్జున సాగర్‌లోకి 99వేల 972 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో స్పిల్‌ వే గేట్లు, విద్యుత్‌ కేంద్రం, ఎడమ, కుడి కాలువలు, ఏఎమ్మార్పీ, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు తరలిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 98వేల 30 క్యూసెక్కులు చేరుతుండగా, స్పిల్‌ వే గేట్లను ఎత్తేసి లక్షా 12వేల 308 క్యూసెక్కులను దిగువకు విడదుల చేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 174.83 అడుగుల్లో 45 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

ప్రకాశం బ్యారేజీలోకి లక్షా 20వేల 976 క్యూసెక్కులు చేరుతుంది. కృష్ణా డెల్టాకు విడుదల చేయగా మిగులుగా ఉన్న లక్షా 18వేల 730 క్యూసెక్కులను 70గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి, వంశధార నదుల్లో ప్రవాహ ఉధృతి పెరిగింది. గోదావరి ఉరకలు వేస్తుండటంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను ఎత్తి 1,80,112 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. గొట్టా బ్యారేజీ నుంచి 3 వేల క్యూసెక్కుల వంశధార జలాలను కడలిలోకి విడుదల చేస్తున్నారు.